పాక్‌ సరిహద్దులో మంటలు

నియంత్రణ రేఖ వెంబడి అడవులు బుగ్గి
జమ్మూ : భారత్‌ పాకిస్థాన్‌ సరిహద్దులో భారీ ఎత్తున దావానలం వ్యాపించింది. దీంతో కాశ్మీర్‌లోని క్రిషన్‌గటి వెంబడి మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల మేర అడవులు బుగ్గిపాలయ్యాయి. పూంచ్‌ జిల్లాలో ఏర్పాటు చేసిన కమ్యూనికేషన్‌ కేబుళ్లు కాలిపోయాయి. చొరబాటు దారులను నియంత్రించేందుకు సరిహద్దు వెంబడి ఏర్పాటు చేసిన మైన్స్‌ (పేలుడు పదార్థం) పెద్దఎత్తున పేలాయి. పాకిస్థాన్‌ అక్రమిత కాశ్మీర్‌లోని దారా షేర్‌ఖాన్‌లో మొదలైన మంటలు భారత్‌లోని నియంత్రణ రేక వెంబడి పూంచ్‌ జిల్లా వరకు వ్యాపించినట్లు ఇక్కడి అధికారులు తెలిపారు. ఇప్పటి దాకా ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కొందరు స్థానికులను సైన్యం, అటవీశాఖ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇదే కాకుండా పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని బండి అబ్బాస్పురా అడవుల్లో కూడా మంటలు చెలరేగాయి. ఇవి ప్రస్తుతం భారత్‌వైపు ఖాదీ కర్మరా వెంబడి దూసుకొస్తున్నాయి.