పాఠశాల విద్యార్థినిపై మైనర్ల అత్యాచారం

పోలీసులకు ఫిర్యాదు చేయని యాజమాన్యం

ఆత్మహత్యాయత్నంతో వెలుగు చూసిన ఘటన

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

కడప,మార్చి1(జ‌నంసాక్షి): ప్రొద్దుటూరు పట్టణం వన్‌టౌన్‌ పరిధిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో దారుణం జరిగింది. అత్యాచారానికి గురైన ఓ మైనర్‌ బాలికను పాఠవాల యాజమాన్యం పట్టించుకోక పోగా బెదిరింపులకు గురిచేసింది. దీంతో తనకు అన్యాయం జరిగిందన్న ఆవేదనలో ఆ అమ్మాయి బంగ్లాపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. చావు బతుకుల మధ్య ఇప్పుడా అమ్మాయి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. రూరల్‌ ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థి పాఠశాల పైనున్న వసతిగృహంలో ఉంటూ అక్కడే చదువుకుంటోంది. అదే పాఠశాల పూర్వ విద్యార్థి, ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న మరో విద్యార్థి కలసి ఫిబ్రవరి 24న పట్టపగలే వసతిగృహంలో ఆ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు వెంటనే పాఠశాల యాజమాన్యానికి విషయం చెప్పింది. విషయం బయటకు చెబితే.. పదిలో ఫెయిల్‌ చేస్తామంటూ యాజమాన్యం భయపెట్టిందే తప్ప చర్య తీసుకోవడమో లేక పోలీసులకు ఫిర్యాదు చేయడమో చేయలేదు. దీంతో ఆ విద్యార్థిని మరునాడే పాఠశాల మూడో అంతస్తు నుంచి కిందకుదూకి ఆత్మహత్యకు ప్రయత్నిం చింది. ఈ ఘటనలో ఆ బాలికకు రెండు కాళ్లు విరగడంతో పాటు, నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. పాఠశాల నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా కర్నూలు జిల్లాలో వైద్యం చేయించే ప్రయత్నం చేశారు. విద్యార్థిని కాలుజారి కిందపడిందని బంధువులకు మంగళవారం సమాచారమిచ్చారు. బంధువులు గురువారం రాత్రి ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకురావడంతో విషయం బయటకు పొక్కింది. అఘాయిత్యానికి పాల్పడ్డ విద్యార్థులు కూడా మైనర్లే. వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.