పాతడ్రైవరే దోపిడీ దొంగ
రాజేంద్ర నగర్ కేసును ఛేదించిన పోలీసులు
హైదరాబాద్,ఆగస్ట్25(జనం సాక్షి): రాజేంద్రనగర్‌లో ఇటీవల జరిగిన దోపిడీ, హత్యకేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. రాజేంద్రనగర్‌లో రాజేందప్రసాద్ అగర్వాల్ అనే వ్యాపారి ఇంట్లో గత పది రోజులక్రితం దోపిడీ, హత్య జరిగాయి. ఇంట్లో ఉన్న రూ. 50లక్షలు, 40 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. కాగా… ఈ కేసుపై ప్రత్యేక దృష్టిసారించిన పోలీసులు దోపిడీకి పాల్పడింది పాత డ్రైవర్ గా తేల్చారు. బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి అగర్వాల్ ఇంట్లో గతంలో కారు డ్రైవర్ గా పనిచేశాడు. ఆ సమయంలో ఇంట్లో డబ్బులు, నగలు ఎక్కడ పెట్టేది చూసిన ఆయన ప్రస్తుతం డ్రైవర్ ఉద్యోగం మానేసి బీహార్ వెళ్లిపోయి కొంతమంది యువకులతో కలిసి దోపిడీకి పథకం వేశారు. అనంతరం రాజేంద్రనగర్ చేరుకుని అగర్వాల్ ఇంట్లో దోపిడీకి పాల్పడ్డారు. కాగా… దోపిడీ సమయంలో నిద్ర నుంచి లేచిన అగర్వాల్ గట్టిగా కేకలు వేస్తుండగా ఆయన మూతికి ప్లాస్టర్ వేయడంతో ఊపిరాడక మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం బంగారం, నగదుతో బీహార్‌లోని పట్నా వెళ్లిపోయాడు. పోలీసులు దాదాపు 10రోజులపాటు శ్రమించి నిందితులను గుర్తించారు.



