పార్టీకి రాజీనామాలు చేసి ఐక్యంగా ఉద్యమిద్దాం

పెద్దపల్లి ఎంపీ వివేక్‌
గోదావరిఖని, జూన్‌ 17, (జనంసాక్షి)
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేం దుకు నాయకులంతా పార్టీకి రాజీనామా చేసి ఐక్య ఉద్యమానికి ముందుకు రావాలని పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యుడు డాక్టర్‌ జి.వివేక్‌ పిలుపునిచ్చారు. ఆది వారం స్థానిక సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావే శంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చి పెట్టాల్సిన లక్ష్యాన్ని తెలంగాణాలోని ప్రజాప్రతి నిధులు గుర్తెరుగాలని, అన్ని పార్టీల తెలంగాణ ప్రజాప్రతినిధులు ఒకవేదికపైకి వచ్చి ఢిల్లీపై ఒత్తిడి తేవాలని అన్నారు. అలాగే ప్రభుత్వంలో ఉన్న పదవులను అధికారపార్టీ నాయకులు పక్కకు పెట్టి తెలంగాణ కోసం ఉద్యమించేందుకు ముందుకు రావాలన్నారు. కాంగ్రెస్‌ అధిష్టానం తెలంగాణ విషయంలో తొందరలో నిర్ణయం తీసుకోకపోత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తుడుచి పెటుకుపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ఉప ఎన్నికల ఫలితాలకు పూర్తి బాధ్యత వహించాలన్నారు. సీమాంధ్రులుతెలంగాణకు వ్యతి రేకం కాదని పెద్దపల్లి వివేకానంద అన్నారు. సీమాంధ్రలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమి ద్వారా ఈ విషయం స్పష్టమైందన్నారు. రాష్ట్ర విభజనకు సీమాంధ్రులు వ్యతిరేకమని ఆ ప్రాంత నాయకులు ఎప్పటినుంచో గగ్గోలు పెడుతున్నారని, అయితే సీమాంధ్రలో జరిగిన ఉప ఎన్నికల్లో ఆ ప్రాంత ప్రజలు ఇచ్చిన తీర్పులోని ఆంతర్యం అర్థం చేసుకోవాల్సిన నైతికత సీమాంధ్ర నాయకులు గుర్తెరుగాల న్నారు. ఈ ఎన్నికల ఫలితాల నేపథ్యంలోనైనా తెలంగాణకు సీమాంధ్ర నాయకులు మద్దతినివ్వాలని, ఇప్పటికే ఈ విషయంలో ఆలోచనలో పడినట్లు తెలుస్తుందని వివేక్‌ పేర్కొన్నారు. ఇప్పటికైనా సీమాంధ్రలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయాల్సిన బాధ్యతా అక్కడి నాయకులకుందని, అదే సమయంలో తెలంగాణను ఇప్పించే బాధ్యతను కూడా తీసుకోవాలని సూచించారు. తెలంగాణాపై లగడపాటి రాజగోపాల్‌ చేస్తున్న వాఖ్యానాలు అతని అవివేకానికి అద్దంపడుతుందన్నారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తెలంగాణ ప్రజలు సహించరన్నారు.కాగా, సింగరేణి ఎన్నికల్లో ఐఎన్‌టియుసిని గెలిపించాలని… కార్మిక హక్కులను సాధించే సత్తా ఐఎన్‌టియుసికే ఉందన్నారు. రానున్న నాలుగు సంవత్సరాల్లో 12నూతన బొగ్గుగనులు రానుండగా… వాటికి త్వరితగతిన అనుమతి వచ్చే విధంగా పాటుపడుతామని, అలాగే రానున్న 5సంవత్సరాల్లో 1200మంది కార్మికులు పదవీ విరమణ పొందనున్న నేపథ్యంతో శాస్త్రీయంగా ఉద్యోగావకాశాలు ఎక్కువ మందికి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ బి.వెంకట్రావు, నాయకులు బడికెల రాజలింగం, పి.మల్లిఖార్జున్‌, రెవెల్లి రాజారాం, ఎస్‌.నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.