పార్లమెంట్‌కు పట్టని హెచ్‌-1 ముప్పు

సమస్యను పట్టించుకోని విపక్షాలు
న్యూఢిల్లీ,జనవరి5(జ‌నంసాక్షి): ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత ఐటి పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపే నిర్ణయాలు ఎన్నో తీసుకున్నారు. ఇంకా తీసుకుంటూనే ఉన్నారు. కానీ ఈ అంశాలను మోడీ ఇప్పటివరకూ ఎన్నడూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తో చర్చించిన దాఖలాలు లేవు. అమెరికా కొత్తగా హెచ్‌1బీ వీసాల విధానంలో కొత్త సవరణను ప్రతిపాదిస్తోంది. ఇదే గనుక అమల్లోకి వస్తే మనవారంతా తట్టాబుట్టా సర్దుకుని రావాల్సిందే. దీనిపై టెక్‌మహీంద్రా ఛైర్మన్‌ స్పందించారు. వచ్చేవారికి స్వాగతం అంటూ ప్రకటన చేశారు. అయితే ఇక్కడికి వచ్చే వారికి మళ్లీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఏ కంపెనీ కూడా ప్రకటించలేదు. అలాగే కేంద్రం కూడా అలాంటి పరిస్థితే వస్తే ఆదుకుంటా మని, అండగా ఉంటామని కేంద్రం కూడా ప్రకటించలేదు. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నా కనీసంగా ఎంపిలు కూడా దీనిని సీరియస్‌గా తీసుకోవడం లేదు. శుక్రవారంతో సమావేశాలు ముగుస్తున్న వేళ కనీసంగా ఈ విపత్కర పరిస్థితులను ప్రస్తావించకపోవడం దారుణం కాక మరోటి కాదు. కేవలం ట్రిపుల్‌ తలాక్‌ వ్యవహారంలో సభ్యులంతా మునిగిపోయారు. కనీసంగా జీరో అవర్‌లో అయినా దీనిని ప్రస్తావించలేకపోయారు. భారతీయ ఐటి పరిశ్రమకు అమెరికా పెద్ద మార్కెట్‌. అంతే కాదు..భారతీయ ఐటి నిపుణులు కూడా ఎక్కువగా ఆధారపడింది అమెరికాపైనే. అమెరికా వరస పెట్టి పెడుతున్న ఆంక్షలు భారతీయ ఐటి రంగాన్ని..యువతను నిరాశకు గురిచేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ప్రభావం ఖచ్చితంగా
దేశీయంగా ప్రభావం చూపించటం ఖాయంగా కనపిస్తోంది. ఇదంతా ఒక ఎత్తయితే అమెరికాయే తమ దేశంగా భావించి అక్కడే స్థిరపడి పోయిన వారి పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా తయరువుతుంటే విదేశాంగ శాఖ కనీసంగా ప్రకటన కూడా విడుదల చేయలేదు. ఇలాంటి వ్యవహారాల్లో చురకుగా ఉండే విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ కూడా సమస్యను పట్టించుకున్నట్లుగా లేదు. అలాగే భారత ప్రధాని మోడీ అత్యంత కీలకమైన ఈ విషయంపై దృష్టి సారించకపోవటంపై  విస్మయం వ్యక్తం అవుతోంది. ట్రంప్‌ ఆదేవాలు కనుక అమల్లోకి వస్తే భారతీయ ఐటి పరిశ్రమ, యువత మరింత కష్టాల్లో పడటం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇంతవరకు  గ్రీన్‌కార్డుపై నిర్ణయం వెలువడే వరకు వీసా గడువును పొడిగిస్తారు.  ఇకపై ఈ విధానాన్ని కొనసాగించకూడదనీ, హెచ్‌1బీ వీసా కలిగిన వారు గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీగ్రీన్‌కార్డు మంజూరవడానికి ముందే వీసా గడువు పూర్తయితే అలాంటి వారిని స్వదేశాలకు పంపించేయాలని ¬ంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదించింది. భారత ఐటీ కంపెనీలు ఏటా అధిక సంఖ్యలో హెచ్‌1బీ వీసాలను సంపాదించి అమెరికాలో తమ కార్యకలాపాల కోసం ఇక్కడి నుంచే ఉద్యోగులను తరలిస్తుండటం తెలిసిందే. తాజా నిర్ణయం అమల్లోకి వస్తే అమెరికాలో పనిచేస్తున్న 5 లక్షల నుంచి ఏడున్నర లక్షల మంది భారతీయులపై ప్రభావం పడే అవకాశం ఉంది. వారంతా గ్రీన్‌కార్డుకు దర ఖాస్తు చేసుకున్నా, వీసా గడువు ముగిసేలోపు అది మంజూరవ్వకపోతే సొంత దేశానికి తిరిగి రావాల్సి ఉంటుంది. ఇది రోహింగ్యాల సమస్యకన్నా తీవ్రమైంది. ఎందరో కుటుంబాల్లో నిప్పులు పోసే చర్యగా మారనుంది. ఇలాంటి సందర్భంలో భారత్‌ త్వరగా స్పందించి అమెరికాతో చర్చించాల్సిన సమయం ఇది.
ఇప్పటికే హెచ్‌1బీ వీసాల జారీ, కొనసాగింపు నిబంధనలను ట్రంప్‌ యంత్రాంగం ఒక్కొక్కటిగా కఠినం చేస్తుండటం తెలిసిందే. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే గ్రీన్‌కార్డుకు దరఖాస్తు పెండింగ్‌లో ఉండగానే వీసా గడువు ముగిసిన విదేశీ ఉద్యోగులు అమెరికా విడిచి స్వదేశాలకు వెళ్లిపోవాల్సి ఉంటుంది. వారందరి ఉద్యోగాలూ ఖాళీ అవుతాయి కాబట్టి ఆ కొలువులు అమెరికా జాతీయులకే దక్కుతాయనేది ట్రంప్‌ ఆలోచనగా ఉంది.  ఇలాంటి విపత్కర పరిస్థితులపై ఆయా కంపెనీలు కూడా స్పందించడం లేదు. అలాంటి వారిని ఇతర దేశాల్లో లేదా భారత్‌లో చేర్చుకోవడం ద్వారా ఉపశమనం కలిగిస్తామని చెప్పడం లేదు. దీనిపై విదేశాంగశాఖ ఎంత త్వరగా స్పందిస్తే అంతమంచిది.