పీఆర్‌సీ కోసం ఉద్యోగుల ఆందోళన

ఆదిలాబాద్‌, జూలై 18 : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన స్థిరీకరణ (పీఆర్‌సి) వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి రమేష్‌ పేర్కొన్నారు. ఈ నెల 15న హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి వాటి పరిష్కారం కోసం ఆందోళనలు చేపట్టాలని తీర్మానించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2013 జూలై 1 నుండి అమలయ్యేలా పీఆర్‌సీని వేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రతిసారి వేతన స్థీకరణలో ఆలస్యం జరుగుతుండడం వల్ల ఉద్యోగులు నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పదో పీఆర్‌సీని ప్రకటించకపోతే అన్ని ఉద్యోగ సంఘాలను కలుపుకుని ఆందోళనలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. విద్యశాఖలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేయాలని, ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు మంజూరు చేయాలని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, దుస్తులు వెంటనే పంపిణీ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.