పూలపండగ అందరికీ ఆదర్శం: మంత్రి సబిత
హైదరాబాద్,అక్టోబర్14 (జనం సాక్షి) తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయలకు ప్రతీకైన బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రజలందరు కుటుంబ సభ్యులు, ఆత్మీయుల మధ్య సంతోషంగా జరుపుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆకాంక్షించారు. ప్రపంచంలోనే పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని అలాంటి సంస్కృతి మన తెలంగాణలో మాత్రమే ఉందన్నారు. సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మహిళలందరికి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలను గౌరవిస్తూ వారి ఔన్నత్యాన్ని చాటిచెప్పే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు. ఈ తొమ్మిది రోజులపాటు తీరొక్క పువ్వుతో బతుకమ్మ పండుగను ఆనందంగా జరుపుకుని, కోరుకున్న కోరికలు నెరవేరాలని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తూ రాష్ట్ర పండుగగా గుర్తించిందన్నారు. ఈ పండుగను ప్రజలందరు వేడుకగా, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకున్నారు. కరోనా నుంచి ప్రలందరిని కాపాడాలని వేడుకుందామని, అందరికి దసరా పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.