పేదరికం నిర్మూలనకు జీవ వైవిద్యం కీలకం: మంత్రి జయంతి

న్యూఢిల్లీ: పరిశ్రమలు, గనులు ఇతర ప్రాజెక్టుల పర్యావరణ, అటవీ అనుమతుల్లో జీవ వైవిధ్య పరిరక్షణను ఒక అంశంగా చేరుస్తామని కేంద్ర పర్యావరణ మంత్రి జయంతి నటరాజన్‌ ప్రకటించారు. హైదరాబాద్‌లో సోమవారం అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు ప్రారంభం అవుతున్న సందర్బంగా మంత్రి దేశంలో జీవ వైవిధ్య పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. పరిశ్రమలు, గనులు, ప్రాజెక్టుల కోసం నరికేసిన అడవులకు బదులుగా పెంచుతున్న అడవుల్లో జీవ వైవిధ్యం తప్పనిసరి చేస్తామని మంత్రి చెప్పారు. వంద కోట్ల జనాభా అవసరాలు తీర్చాల్సిన ఒత్తిడిలోనూ ఇంతటి జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలగడం గొప్ప విషయమని మంత్రి చెప్పారు. లక్షల మంది ప్రజల జీవనోపాధి జీవ వైవిధ్యంతోనే ముడిపడి ఉందన్నారు. ఈ విధంగా పేదరికం నిర్మూలనకు జీవ వైవిధ్యం కీలకమని తెలిపారు