పొంగుతున్న వాగులు, వంకలు ఏజెన్సీ వాసుల కడగండ్లు

హైదరాబాద్‌, ఆగస్టు 8 (జనంసాక్షి): వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తూ, లోతట్టు ప్రాంతాలను నిరుపేదల ఆవాసాలను ముంచెత్తడంలో ప్రకృతి ధర్మం ఉన్నప్పటికీ, ఈ ముప్పుును నివారించడంలో ప్రభుత్వ అలసత్వం స్పష్టంగా కనబడుతుంది. వర్షాకాలానికి ముందుగానే రాబోయే ప్రమాదాన్ని అంచనా వేసి వాటి నివారణకు అవసరమైన సమగ్ర ప్రణాళికలను రూపొందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. కొండచరియలు విరిగి పడడం, తీరప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలను కబళిస్తున్న ముంపును అరికట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి నెలకొని వుంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఈ దుస్థితి తీవ్రంగా ఉంది. పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో కురిసిన వానలకు ఖమ్మం జిల్లాలోని ఏర్లు పొంగి పొర్లుతూ ఊళ్లను చుట్టుముట్టి, గ్రామాలను లంకలుగా మార్చేస్తున్నాయి. చంద్రవంక, సోకిలేరు, చీకటివాగు, అత్తాకోడళ్ల వాగు గ్రామీణుల జీవితాలను దుర్భరంగా మారుస్తున్నాయి. ముఖ్యంగా, చర్ల, చింతూరు, తదితర ఏజెన్సీ ప్రాంతాల మండలాల్లో పరిస్థితి భయానకంగా ఉంది. డజన్లాది గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెలిపోయాయి. రోడ్డు తెగిపడి, రాకపోకలకు అవకాశం లేకుండా పోయింది. వాగుల్లోంచి పొంగిన నీరు రోడ్ల మీదుగా ప్రవహిస్తూ విలయతాండవం చేస్తున్నాయి. తలిపేరు రిజర్వాయ్‌లోకి అదనంగా వచ్చి చేరిన వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి మళ్లిస్తున్నారు. భద్రాచలం దగ్గిర 14 గేట్లు ఎత్తేసి, వర్షపు నీటిని నదిలోకి వదిలేశారు. ఈ క్రమం మరికొంతకాలం కొనసాగేలా ఉంది. ఈ విషయంలోనైనా తగినంత మెలకువ ప్రదర్శించకపోతే, రిజర్వాయర్లకు చేరిన నీరు గోదారి గంగపాలయ్యే ప్రమాదం ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోని లోతట్టు ప్రాంతాలకు కూడా ప్రమాదం పొంచి ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
పాలన యంత్రాంగం వైఖరి ఘోరంగా ఉంది. రోజూ చచ్చేవాడికోసం ఏడ్చేదెవరన్నట్టు వ్యవహరిస్తున్నారు అధికారులు. ఎందుకోగానీ, ఇళ్లంటుకున్న తర్వాతే, మన అధికారులు బావి తవ్వడం మొదలుపెడతారు! దాదాపు ప్రతి వర్షాకాలం ఉండేదే ఇదంతా. తీవ్రతలో హెచ్చు తగ్గులు ఉండొచ్చు గానీ, కొండవాగులు పొంగి గ్రామలను చుట్టుముట్టడం ఏటా జరిగేదే! ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో వానలు కురుస్తున్న తీరుతెన్పులను ఓ కంట గమనిస్తే, మన గ్రామల కోసం కాస్త ముందస్తుగా ప్రణాళిక సిద్ధంచేసుకోవచ్చు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో కూడా కొంపలు ములిగిన తర్వాతే కళ్లు తెరుస్తామనడం సబబు కాదు. పంటల సంగతి ఎట్లా ఉన్న కనీసం ప్రాణాలైన దక్కితే చాలని ఖమ్మం జిల్లాలోని ఏజెన్సీ వాసులు కోరుకుంటున్నారు.