పోలీసే దొంగ‌ : వాట్సాప్‌ చేధించిన కేసు

ఉదయం తెల్లని రంగు షర్టు, ఖాకీ ప్యాంటుతో తెల్లటి హెల్మెట్ ధరించి రోడ్డుపై ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తుంటాడు.. రాత్రి కాగానే యువకుడిలా జీన్స్ ధరించి.. రంగురంగుల టీ షర్టు, ముఖానికి మాస్క్.. కళ్లకు స్టైలిష్ అద్దాలతో చైన్‌స్నాచింగ్‌లు.. ఇలా రెండు పాత్రలు పోషిస్తున్న ఓ హోంగార్డు వాట్సాప్ ద్వారా అడ్డంగా దొరికిపోయాడు. స్థానికులు సైబరాబాద్ పోలీసులకు ఫోటో షేర్ చేయడంతో అతగాడి ముసుగు తొలిగిపోయింది.

సైబరాబాద్‌లోని బాలానగర్ డివిజన్ ట్రాఫిక్ విభాగంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న అతను గత కొంత కాలంగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారని పోలీసులకు తెలిసింది. మంగళవారం జీడిమెట్ల ప్రాంతంలో గొలుసు అపహరించిన వ్యక్తి పొటో స్థానికులకు చిక్కింది. ఇంకేం వెంటనే వారు పోలీస్ వాట్సాప్‌కు పంపించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఫొటోలో అతను ప్రయాణించిన బైక్ నెంబరు కూడా ఉండటంతో ఛేదించడం మరింత సులువు అయింది.ద్విచక్రవాహనం కోసం గాలిస్తుండగా దానిపై ప్రయాణిస్తున్న హోంగార్డు జీడిమెట్ల పోలీసులకు దొరికిపోయాడు. అదుపులోకి తీసుకుని జీడిమెట్ల పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికి వరకు సదరు హోం గార్డు మొత్తం 12 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు సమాచారం.