పోషకాహారంపై అవగాహన కల్పించాలి
సిడిపివో నూర్జహాన్‌బేగం
కొనకనమిట్ల , జూలై 26 : పోషకాహార ప్రాముఖ్యతపై గ్రామాల్లోని బాలింతలకు, గర్భవతులకు తెలియచేయాల్సిన అవసరం అంగన్‌వాడీ కార్యకర్తలకు ఎంతైనా ఉందని ఐసిడిఎస్ పొదిలి ప్రాజెక్టు సిడిపివో ఎస్ నూర్జహాన్‌బేగం అన్నారు. మహిళా శిశు చైతన్య సదస్సుల్లో భాగంగా గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో అంగన్‌వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక పోషకాహార అవగాహన సదస్సుల్లో పాల్గొని ఆమె మాట్లాడారు. తల్లులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే పిల్లలకు సరైన పోషకాహారం లభిస్తుందని అన్నారు. తల్లులు బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు తాపించాలని అన్నారు. ఆడపిల్లలను చదివించి వారి భవిష్యత్తుకు పునాదులు వేయాలని అన్నారు. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం రామచంద్రయ్య మాట్లాడుతూ ఆడపిల్లల పట్ల వివక్షత చూపరాదని వారికి ఉన్నత విద్యను అభ్యసించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సమాజంలో స్త్రీ అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ది జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. బాలికలు అభివృద్ధికి ఎన్నో పథకాలను ప్రభుత్వం ప్రవేశపెడుతుందని అన్నారు. ప్రతి తల్లికి పౌష్టికాహారం అందేలా కార్యకర్తలు చొరవ చూపాలని ఇఓఆర్‌డి ఎం తిరుపతయ్య కోరారు. ఈ సమావేశానికి అంగన్‌వాడీ సూపర్‌వైజర్ అరుణాదేవి అధ్యక్షత వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు ఎ రాంబసుబ్బులు, ఎస్‌ఎ లతీఫ్‌బిబి, ఎస్‌కె సైదాబి, స్థానిక అంగన్‌వాడీ కార్యకర్తలు సునీత, విజయకుమారి, లక్ష్మీప్రసన్న, పి వెంకటమ్మ, ఆర్ కాశమ్మ మండలంలోని అంగన్‌వాడీ కార్యకర్తలందరూ పాల్గొన్నారు. అనంతరం పోషక విలువలు ఉండే ఆహార పదార్థాలను జామకాయలను కిశోర బాలికలకు పంపిణీ చేశారు.