ప్రజాసమస్యలపై పోరాడుతాం : కరుణాకర్‌రెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 16(జనంసాక్షి): జగన్‌ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం ఉండబట్టే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించారని ఆ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఉప ఎన్నికల్లో విజయం సాధించిన 15 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపి శనివారంనాడు చంచల్‌గూడ జైలులో ఉన్న జగన్‌ను కలిసి ఎన్నికల సరళిపై చర్చించారు. అనంతరం వెలుపలికి వచ్చిన కరుణాకర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ప్రజా కోర్టులో జగన్‌ నిర్దోషి అని తేలిందని, అందుకు ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనమని అన్నారు. జగన్‌ అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడితే ప్రజాకోర్టులో తీర్పు మరోలా ఉండేదన్నారు. జగన్‌ నాయకత్వంలో తాను పనిచేయడానికి గర్వపడుతున్నానన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య లపై నిరంతరం పోరాటం చేస్తామన్నారు. జగన్‌ నిబద్ధత గల వ్యక్తి కాబట్టే ప్రజలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు ఓట్లు వేశారన్నారు. సానుభూతితో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలిచిందని కొందరు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పద మని అన్నారు. సానుభూతితో గెలిచామన్నా కూడా తమకెటువంటి అభ్యంతరం లేదన్నారు. జగన్‌ సూచనలను తీసుకుంటూ పార్టీని మరింత పటిష్టవంతం చేసేందుకు సమష్టిగా కృషి చేస్తామని కరుణాకర్‌రెడ్డి అన్నారు. ప్రజాతీర్పును సాదరంగా స్వాగతిస్తున్నామని, తమపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని చూసి గర్వపడుతున్నామని అన్నారు. కాంగ్రెస్‌, టీడీపీలు ఎన్ని కుతంత్రాలు పన్నినా.. ప్రజలు తమతోనే ఉన్నారన్న విషయం మరోసారి రూఢీ అయిందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి ప్రజలకు అందేలా వివిధ సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలో పోరాడుతామని కరుణాకర్‌రెడ్డి అన్నారు.