ప్రణబ్‌కు తెలంగాణ సెగ

కాన్వాయ్‌ని అడ్డుకున్న తెలంగాణవాదులు
56 పార్టీలు లేఖలిచ్చినా రిపోర్టు ఇవ్వని ప్రణబ్‌ కమిటీ
నువ్వు ఢిల్లీలో ఉంటే ప్రకటన వచ్చివుండేది కాదన్నావ్‌
తెలంగాణ ప్రతినిధుల ఓట్లెట్లడుగుతావ్‌
హైద్రాబాద్‌,జూలై1 (జనంసాక్షి):
రాష్ట్రపతి అభ్యర్దిత్వానికి మద్దతు కూడగట్టుకొనేందుకై హైద్రాబాద్‌ ప్రచారానికి వచ్చిన ప్రణబ్‌ముఖర్జీకి తెలంగాణ సెగ తగిలింది. బేగంపేట విమానాశ్రయం నుండి జూబ్లీహాల్‌కు బయలుదేరిన ప్రణబ్‌,సీఎంల కాన్వాయ్‌కి తెలంగాణవాదులు అడ్డుతగిలారు. తెలంగాణ మాలమహానాడు కార్యకర్తలు గన్‌పార్క్‌ వద్ద తెలంగాణ నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు.దీంతో గన్‌ పార్క్‌ వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు వారిని చెదరగొట్టి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పలువురు మీడియా తో మాట్లాడుతూ 56 పార్టీలు లేఖలిచ్చినా ప్రణబ్‌ ఆధ్వర్యంలోని కమిటీ తన రిపోర్టును వెల్లడించలేదని, అలాంటిది ఇప్పుడు తెలంగాణ ప్రతినిధుల ఓట్లు ఎలా అడుగుతావని వారు ప్రశ్నిస్తూ తెలంగాణపై వెంటనే తమ వైఖరి వెల్లడించాలంటూ డిమాండ్‌చేశారు. అంతేకాక డిసెంబర్‌9 ప్రకటన వచ్చినపుడు తాను కోల్‌కతాలో ఉన్నానని, ఢిల్లీలో ఉంటే ఆప్రకటన వచ్చేది కాదన్న ప్రణబ్‌కు తెలంగాణ ఓట్లడిగే హక్కు లేదన్నారు.