ప్రణబ్‌కే మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి

సీఎల్‌పీ సమావేశంలో సీఎం కిరణ్‌
మీటింగ్‌కు 12 మంది ఎమ్మెల్యేల డుమ్మా
హైదరాబాద్‌, జూలై 18 : యుపిఎ రాష్ట్రపతి అభ్యర్ధి ప్రణబ్‌ భారీ మెజారిటీ సాధిస్తారని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ సందర్భంగా క్రాస్‌ ఓటింగ్‌కు ఆస్కారమే లేదని చెప్పారు. జూబ్లీహాల్‌లో బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సిఎల్‌పి సమావేశమైంది. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా మాక్‌ పోలింగ్‌ను నిర్వహించారు. ఓటింగ్‌ విధానంపై ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు అవగాహన కల్పించారు. బ్యాలెట్‌ పేపరుపై ఉన్న వరుస క్రమంలో రెండో కాలమ్‌లో ప్రణబ్‌ ఉంటారని, దానికి ఎదురుగా ఒకటి అని వేయాలని సూచించారు. రెండో ప్రాధాన్యత ఓటు జోలికి పోవద్దని ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు సిఎం సూచించారు. సమావేశం ముగిసిన అనంతరం ఉప ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల అందరి మద్దతు ప్రణబ్‌కేనని చెప్పారు.
అసెంబ్లీలో ఏర్పాట్లు పూర్తి
భారత రాష్ట్రపతి పదవికి గురువారం ఎన్నిక జరగనున్న సందర్భంగా నగరంలోని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలింగ్‌ గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5గంటల వరకు కొనసాగుతుంది. పోలింగ్‌ అనంతరం బ్యాలెట్‌ బాక్స్‌లను ఢిల్లీకి పంపుతారు. ఈ నెల 21న ఓట్ల లెక్కింపు జరగనున్న విషయం తెలిసిందే. అదేరోజు ఫలితాలను వెలువరిస్తారు.