ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే కఠిన చర్యలే
మహబూబాబాద్ బ్యూరో-మార్చి 15(జనంసాక్షి)
ఇకపై ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. బుధవారం ఐడిఓసి లోని కలెక్టర్ ఛాంబర్ లో ప్రభుత్వ భూముల పరిరక్షణ పై జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్, జిల్లా అటవీ శాఖ అధికారి రవి కిరణ్, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ లతో కలిసి సంబంధిత పోలీసు రెవెన్యూ మున్సిపల్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే సహించబోమని కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భూముల ఆక్రమించిన వారు ఎవరైనా సరే ఉపేక్షించరాదని వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా కేసులు కూడా బుక్ చేస్తామన్నారు. జిల్లాలోని గాయత్రి గుట్ట సిగ్నల్ కాలనీ హస్తినాపురం వికలాంగుల కాలనీ నంది నగర్ తదితర ప్రాంతాలలో పోలీసు మున్సిపల్ రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సమన్వయంతో బృందాలు ఏర్పడి దాడులను నిర్వహించాలన్నారు. పది రోజులలో భూములను స్వాధీనం చేసుకొని ఆయా ప్రాంతాల వారీగా సర్వే నెంబర్లతో నివేదికలు ఇవ్వాలని అధికారుల ఆదేశించారు. గతంలో ఆక్రమించిన వారి వివరాలు కూడా ఇవ్వాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఫోటోలు తీయాలని తగిన ఆధారాలు సేకరించి కేసులు పెట్టాలన్నారు. ప్రభుత్వ భూములు పరిరక్షణ కొరకు స్ట్రేంచ్ కొట్టించాలని, స్థలం చుట్టూ బార్డర్ గా మొక్కలను నాటింప చేయాలని అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్డిఓ కొమరయ్య, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, తాసిల్దార్ నాగ భవాని, మహబూబాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారి నవీన్, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.