ప్రముఖ నటి ఎంపీ జయాబచ్చన్‌కు షిండే క్షమాపణ

న్యూఢిల్లీ: గురువారం రాజ్యసభలో జయాబచ్చన్‌ను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగటంతో కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే క్షమాపణ చెప్పారు. అస్సాం హింసాకాండపై జరిగిన చర్చకు ప్రత్యుత్తరం ఇస్తూ షిండే ప్రసంగిస్తున్న సమయంలో ప్రముఖ నటి ఎంపీ జయాబచ్చన్‌ మధ్యలో జోక్యం చేసుకున్నారు. దీంతో అసహనానికి గురైన షిండే.. ఇది ముఖ్యమైన అంశం. సినిమాలకు సంబంధించినది కాదు, అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యపై జయ తీవ్రమైన అభ్యంతరం తెలియజేయటం, ఆమెకు పలువురు సభ్యులు మద్దతు తెలపటంతో సభలో గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష నేత అరుణ్‌జైట్లీ కూడా షిండే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆ మాటలకు రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. దీంతో షిండే నా వ్యాఖ్యలతో ఆమె బధపడి ఉంటే క్షమాపణ కోరుతున్నా. ఆమె నాకు సోదరి. బచ్చన్‌ కుటుంబం మొత్తం నాకు తెలుసు అని ప్రకటించటంతో సభలో వివాదం సద్దుమణిగింది. అనంతరం అస్సాం అల్లర్లపై షిండే వివరణ కొనసాగించారు.