ప్రశాంత కౌన్సెలింగ్‌కు సహకరించండి

ఉపాధ్యాయ సంఘాలను కోరిన డీఈవో అరుణకుమారి
శ్రీకాకుళం, జూన్‌ 27 : మరికొద్ది రోజుల్లో జరగనున్న ఉపాధ్యాయ బదిలీల కౌన్సెలింగ్‌ ప్రశాంతంగా ముగిసేలా సహకరించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఎస్‌.అరుణకుమారి ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులను కోరారు. శ్రీకాకుళం పట్టణంలోని స్థానిక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో జరిగిన ఉపాధ్యాయ సంఘాల సమన్వయ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. తనకు ఉపాధ్యాయ బదిలీల కౌన్సెలింగ్‌ నిర్వహించడం ఇదే తొలిసారి అని, పూర్తిగా సహకరించి విజయవంతంగా ముగిసేలా చూడాలని కోరారు. సజావుగా సాగేందుకు చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేస్తే అమలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా స్కూల్‌ అసిస్టెంట్లకు పాయింట్ల కేటాయింపులో అన్యాయం జరుగుతుందని, షెడ్యూల్‌ ప్రకారం విద్యాశాఖ కార్యాలయం అధికారులు ప్రకటనలు జారీ చేయడం లేదని, సమాచారం లేక గందరగోళ పరిస్థితులు ఉన్నాయని పలువురు నేతలు చెప్పారు. ఈ సమావేశంలో ఉప విద్యాశాఖ అధికారులు బి.మల్లేశ్వరరావు, కె.అప్పారావుతో పాటు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు సన్నశెట్టి రాజశేఖర్‌, భానుమూర్తి, కోనె శ్రీధర్‌, హరిశ్చంద్రుడు, గిరిధర్‌, శివరాంప్రసాద్‌, బలరామకృష్ణ, రాజేంద్రప్రసాద్‌, వసంతరావు, పి.ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.