ప్రాజెక్టు నిర్మాణాల్లో పురోగతి ఏదీ?: డీకే

హైదరాబాద్‌: తెరాస ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్నా రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల నిర్మాణాలు చూస్తే ఎక్కడ వేసిన గంగోళి అక్కడే చందంగా ఉన్నాయని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ… నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు రెండు రోజుల మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటనలో ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు రూ.10 వేల కోట్లతో ప్రతిపాదనలు చేయగా, డీపీఆర్‌ ఆదేశాల మేరకు కొన్ని మార్పులు చేర్పులు చేసి దానిని తెరాస ప్రభుత్వం రూ.10 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్లకు పెంచి వాటి కోసం అప్పులు తీసుకువస్తున్నారని ఆమె తెలిపారు. ఈ మేరకు ఆ ప్రాజెక్టుల నిర్మాణాల కోసం చేస్తున్న అప్పులు తీర్చే భారం తిరిగి ప్రజల పైనే పడుతుందని ఆమె అన్నారు.

రూ. వేల కోట్లతో ప్రాజెక్టు నిర్మాణాలను చేపట్టామని చెప్పి ప్రభుత్వం జేబులను నింపుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. మాటల గారడీతో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రాజెక్టు నిర్మాణాల్లో ఎలాంటి లోపాల్లేకుండా చేపడితే కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. ప్రభుత్వ పరిపాలనా తీరులో లోపాలతో పాలమూరు రైతులు తీవ్రంగా నష్టపోయారని.. ఇప్పటికైనా స్పందించి వెంటనే మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని ఆమె కోరారు.