ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్లకు బంగ్లా బోర్డు సెంట్రల్‌ కాంట్రాక్టులు

ఢాకా, ఆగస్టు 29: ప్రపంచ క్రికెట్‌లో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు సరికొత్త పధ్ధతికి శ్రీకారం చుట్టింది. తొలిసారిగా ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్లకు కూడా సెంట్రల్‌ కాంట్రాక్టులు ఇచ్చింది. ఇప్పటి వరకూ కేవలం జాతీయ జట్టులో ఉన్న ఆటగాళ్ళకు మాత్రమే కాంట్రాక్టులు వర్తింపజేసింది. అయితే ఇకపై దేశవాళీ క్రికెట్‌తో పాటు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో రాణించే ఆటగాళ్లను సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ పరిధిలోకి తీసుకొచ్చింది. మొత్తం 105 మంది యువక్రికెటర్లు ఈ జాబితాలో ఉన్నారు. బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు నిర్ణయంతో అక్కడి డొమెస్టిక్‌ క్రికెట్‌లో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఎన్‌సిఎల్‌ భాగమైన ఎనిమిది దేశవాళీ జట్లకు ఆడుతోన్న వీరందరికీ అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని మ్యాచ్‌ ఫీజులు నిర్ణయించారు. మొత్తం మూడు కేటగిరీలుగా విభజించారు. 11 సంవత్సరాల కంటే ఎక్కువ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ అనుభవం కలిగిన ఆటగాళ్ళందరూ గ్రేడ్‌ ఎలోకి వస్తారు. వీరికి ప్రతీ నెలా 300 డాలర్లు చొప్పున చెల్లిస్తారు. అలాగే 6 నుండి 10 సంవత్సరాలు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడిన ఆటగాళ్ళు గ్రేడ్‌ సిలో చోటు దక్కించుకున్నారు. వీరికి ప్రతీనెలా 240 డాలర్లు చెల్లిస్తారు. ఇక 1 నుండి ఐదేళ్ళ లోపు అనుభవం కలిగిన ఆటగాళ్ళకు సి గ్రేడ్‌ సి దక్కింది. వీరికి ప్రతీ నెలా 180 డాలర్లు దక్కుతాయి. అక్టోబర్‌ 2012లోనే డొమెస్టిక్‌ సీజమ్‌ ప్రారంభం కానున్నప్పటకీ.. కాంట్రాక్టులు మాత్రం వచ్చే ఏడాది జనవరి నుండి అమలులోకి వస్తాయి. ఢాకా నేషనల్‌ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో బంగ్లాదేశ్‌ క్రికెటర్లకు బీసీబీ ప్రెసిడెంట్‌ ముస్తాఫా కమల్‌ కాంట్రాక్ట్‌ పత్రాలు అందజేశారు. బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు నిర్ణయాన్ని మాజీ కెప్టెన్‌ హబీబుల్‌ బాషర్‌ స్వాగతించాడు. ప్రస్తుతం జాతీయ సెలక్టర్‌గా ఉన్న బాషర్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కు మంచి ప్రోత్సాహాన్నిస్తుందని చెప్పాడు. బంగ్లాదేశ్‌లో 1999 నుండి ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ప్రారంభమైంది. ఎన్‌సిఎల్‌ వేదికగా ఆరు డొమెస్టిక్‌ జట్లు మ్యాచ్‌లు ఆడుతున్నాయి.