మహోద్యమానికి సిద్ధమవుతున్న బీసీలు
ఖమ్మం (జనంసాక్షి) : కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను మోసగించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫెళ పెళమని విరుచుకుపడేందుకు బీసీలు మహోద్యమానికి సన్నద్ధమవుతున్నారని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ సభ్యులు జూలూరు గౌరీ శంకర్ తెలిపారు. బీసీల ఆశలను వమ్ము చేసిన దగా కోరుతనంపై బీసీలు గొంతు విప్పి ప్రళయ గర్జనలు చేసే సమయం ఆసన్నమైంది అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా మోసగించిన తీరును నిరసిస్తూ మంగళవారం ఖమ్మం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ముందుగల జ్యోతిబాపూలే సావిత్రి పూలే విగ్రహాల వద్ద బీసీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో జూలూరు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కామారెడ్డి డిక్లరేషన్ను అమలు జరుపుతామని ఎన్నికల్లో కాంగ్రెస్ చెప్పిందేమిటి, ఇప్పుడు ఆచరణలో చేస్తుంది ఏమిటని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. బీసీలలో గూడుగట్టుకున్న ఆవేదన ఇక ఉద్యమ రూపంలో ప్రజ్వరిల్లే సమయం ఆసన్నమైందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ విడుదల చేసిన జీవో 9 ని వెనక్కు తీసుకొని తిరిగి 46 జీవోను విడుదల చేయటం దుర్మార్గమైందన్నారు. రాజ్యాంగ సవరణ చేయకుండా, షెడ్యూల్డ్ తొమ్మిదిలో చేర్చకుండా బీసీలకు రిజర్వేషన్లు రావని తెలిసి కూడా కాంగ్రెస్ బీసీలను మోసపుచ్చి గద్దెనెక్కిందని ధ్వజమెత్తారు. బీసీలు జో కొడితే ఊరుకుంటారని కాంగ్రెస్ పగటి కలలు కంటుందని బీసీల ఆగ్రహాన్ని చవిచూడక తప్పదు అన్నారు. ఎన్నికల్లో రాహుల్ గాంధీ చెప్పిందాన్ని రేవంత్ రెడ్డి అమలు జరపకుండా బీసీలను మోసగించారన్నారు. ఎన్నికల్లో గెలవడానికి కామారెడ్డి డిక్లరేషన్ విడుదల చేశారు కానీ వాళ్లకు బీసీల మీద ప్రేమ లేదన్నారు. రాజ్యాంగపరమైన సవరణలు జరగకుండా బీసీలకు రిజర్వేషన్లు రావన్నారు. బీసీలు తమ హక్కుగా రావాల్సిన వాటాను అడుగుతున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ వేసే భిక్ష బీసీలకు అక్కరలేదని చెప్పారు. బీసీలు ఇక మోసపోవడానికి సిద్ధంగా లేరన్న విషయాన్ని పాలకులు తెలుసుకోవాలని హెచ్చరించారు. రెండు కోట్లకు పైగా ఉన్న బీసీలను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి నైతికంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 12760 గ్రామపంచాయతీలో సగం పదవులు బీసీలకు వస్తాయని ఆశగా ఎదురు చూశారని కాంగ్రెస్ నమ్మించి గొంతు కోసిందని విమర్శించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో చెప్పిన విధంగా కాంట్రాక్టు పనుల్లో 42 శాతం ఇస్తామని చెప్పి పైసా పని కూడా ఇవ్వలేదు అన్నారు. ఏటా 20 వేల కోట్లు ఇస్తామని చెప్పి శూన్య హస్తాలు చూపించారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల హక్కులను హాననం చేసిందని ధ్వనిత్తారు అన్ని పార్టీలలో ఉన్న బీసీలు ఒక్క వేదిక పైకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గాన్ని దునుమాడాలని తెలిపారు. సగం జనాభా నువ్వు మోసగించిన ప్రభుత్వ దుర్నీతిపై కవులు రచయితలు కళాకారులు సామాజిక వేత్తలు తమ కళాలను గళాలను విప్పాలని జూలూరు కోరారు. బీసీ సీనియర్ నాయకులు, ఖమ్మం జిల్లా బీసీ జేఏసీ నాయకులు శ్రీ రామ్మూర్తి, బీసీ జిల్లా యువ నాయకులు, బత్తిని మధు గౌడ్,తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు డాక్టర్ కె వి కృష్ణారావు, ఖమ్మం జిల్లా టీఎన్జీవో మాజీ నాయకులు, బీసీ ఉద్యోగ నాయకులు రంగరాజు, నాయకులుమోడేపల్లి కృష్ణమాచారి జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, లింగన్న బోయిన పుల్లారావు ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మసనం శివరామకృష్ణ జిల్లా ప్రధాన కార్యదర్శి, గద్దె వెంకటరామయ్య ఖమ్మం టౌన్ అధ్యక్షులు, అమృతపు మల్లికార్జున్ ఖమ్మం టౌన్ ప్రధాన కార్యదర్శి, గజ్జల శ్రీదేవి ఖమ్మం జిల్లా మహిళా అధ్యక్షురాలు, ఖమ్మంపాటి బక్కయ్య, తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు.



