ఫిలడెల్ఫియాలో మార్చ్‌కు మద్దతుగా

టీ ఎన్‌ఆర్‌ఐల సంఘీభావం

ఫిలడెల్ఫియా, సెప్టెంబర్‌ 26 (జనంసాక్షి) :
అమెరికాలోని ఫిలడెల్ఫియా రాష్ట్రంలో తెలంగాణ ఎన్నారైలు కదం తొక్కారు. ర్యాలీ నిర్వహించి, ప్లకార్డులు చేతబట్టి తెలంగాణ మార్చ్‌కు మద్దతు తెలిపారు. ఫిలడెల్ఫియా తెలంగాణ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ సంఘీభావ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్నారైలు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలే కాకుండా, విదేశాల్లో ఉన్న తెలంగాణకు చెందిన ఎన్నారైలంతా తెలంగాణ మార్చ్‌కు మద్దతు తెలుపుతున్నామని స్పష్టం చేశారు. గతంలోనే తెలంగాణ ఇచ్చి, వెనక్కి తీసుకున్న కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి, ఆకాంక్షను అణగదొక్కిందని ఆరోపించారు. అందుకే, ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం మళ్లీ ఊపందుకున్నదని, తెలంగాణ మార్చ్‌ కూడా అందులో భాగమేనని, ఇదంతా ప్రభుత్వం స్వయం కృతాపరాధమని వెల్లడించారు. తెలంగాణ మార్చ్‌కు అనుమతి నివ్వకుండా ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను రెచ్చగొట్టేం దుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. తెలంగాణవాదులకు తమ పూర్తి మద్దతు ఉంటుందని, తెలంగాణ ప్రజలు ఇంటికొకరు చొప్పున ట్యాంక్‌ బండ్‌పైకి తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం మార్చ్‌కు అనుమతినివ్వాలని లేకుంటే, తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్‌ పార్టీపై ఉన్న కొద్దిపాటి నమ్మకాన్ని చేజార్చుకోవద్దని ఆయన సలహా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర నేతల ఒత్తిళ్లకు తలొగ్గుతోందని వారి మాటలు వింటే తెలంగాణలో నష్టపోయేది కాంగ్రెస్‌ పార్టీనేనని గుర్తించాలని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందే తప్ప, నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఘాటుగా విమర్శించారు. తెలంగాణ మార్చ్‌ను విరమించుకోవాలని చెప్పే నైతిక హక్కు ప్రభుత్వానికి లేదన్నారు. తెలంగాణ మార్చ్‌ను శాంతియుతంగా నిర్వహించాలని తెలంగాణవాదులకు ఎన్నారైలు పిలుపునిచ్చారు. సీమాంధ్ర పాలకులతో తెలంగాణకు మొదటి నుంచీ అన్యాయం జరుగుతోందన్నారు. తెలంగాణ మార్చ్‌లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.