బీసీలకు 50శాతం అసెంబ్లీ సీట్లు కేటాయించాలి

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): రానున్న ఎన్నికల్లో బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు 50 శాతం సీట్లు కేటాయించాలని బీసీ విద్యార్థి సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు వీరబోయిన లింగయ్య యాదవ్ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఏ పార్టీ అయితే బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయిస్తుందో వారికే తమ మద్దతు ఉంటుందని, ఇవ్వని పార్టీలకు డిపాజిట్ రాకుండా చేస్తామని హెచ్చరించారు. అదే విధంగా అగ్రవర్ణ ఎమ్మెల్యేలు, మంత్రులు బీసీ ఎమ్మెల్యేలు ఉన్న చోట వారిపై లేనిపోని నిందలు వేసి వారికి ఎమ్మెల్యే టికెట్లు రాకుండా అడ్డుపడుతూ, వారి అనుచరులే ఆ నియోజకవర్గాలలో చలామణి అవుతున్నారని విమర్శించారు. అదే అగ్రవర్ణాలు ఎమ్మెల్యే ఉన్నచోట ఎస్సీ, ఎస్టీ, బీసీలు మాట్లాడితే వారిని ఆ పార్టీలో నుంచి సస్పెండ్ చేస్తున్నారని, వారు మాట్లాడితే కనీసం స్పందించరన్నారు. బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా, జెండాలు మోసే కార్యకర్తలుగా చూస్తున్నారే తప్ప వారిని పాలకులుగా చూడటం లేదన్నారు.బీసీలందరూ కలిసికట్టుగా పార్టీలకతంగా ఏకం కావాలని కోరారు.త్వరలో సూర్యాపేటలో బీసీల రాజ్యాధికార సభను పెద్దఎత్తున నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు పార్టీలకతీతంగా బీసీలందరూ హాజరు కావాలన్నారు.ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాలుగు అసెంబ్లీ సీట్లు, ఒక ఎంపీ సీటును బీసీలకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీసీలందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు.