బీసీ కులగణనపై పెదవివిరిచిన ప్రధాని మోదీ

నాసిక్‌(జనంసాక్షి): బీసీ కులగణనపై మోదీ మరోసారి పెదవివిరిచారు.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ పార్టీని యావత్‌ దేశం పూర్తిగా తిరస్కరించిందని.. అందుకు ఆ పార్టీ చర్యలే కారణమన్నారు. ఆ పార్టీ ఇప్పుడు ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కాదన్న మోదీ.. పరాన్నజీవి పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. ఊత కర్రల సాయంతోనే మనుగడ సాగిస్తోందని విమర్శించారు. శుక్రవారం నాసిక్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని ప్రసంగించారు.మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, రaార్ఖండ్‌.. ఇలా ఏ రాష్ట్రంలో చూసినా కాంగ్రెస్‌ పార్టీ ఇతర పార్టీలపై ఆధారపడే పోటీచేసే పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్‌, దాని మిత్ర పక్షాలు ఉన్న చోట కుంభకోణాలేనంటూ విరుచుకుపడ్డారు. ఈ పార్టీలేవీ రాజ్యాంగం, కోర్టులు, ప్రజల మనోభావాలను సైతం పట్టించుకోవన్నారు. కేవలం షో చేయడానికే కాంగ్రెస్‌ నేతలు రాజ్యాంగం పుస్తకాన్ని జేబుల్లో పెట్టుకొని తిరుగుతుంటారని ఎద్దేవా చేశారు. తన నాయకత్వంలో ఏర్పాటైన ఎన్డీయే ప్రభుత్వ హయాంలో 25 కోట్ల మంది ప్రజలకు పేదరికం నుంచి విముక్తి కల్పించామన్నారు. కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు చేశామన్న మోదీ.. తద్వారా ‘ఒకే దేశం`ఒకే రాజ్యాంగం’ స్ఫూర్తి వాస్తవిక రూపం దాల్చిందని తెలిపారు.