బెల్లంపల్లిలోనే మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలి విద్యార్థి సంఘాల డిమాండ్.

విద్యా శాఖ మంత్రికి వినతి.
పోటో: వినతి పత్రాన్ని అందజేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు.
బెల్లంపల్లి, సెప్టెంబర్23( జనంసాక్షి)
బెల్లంపల్లి పట్టణంలోనే జిల్లాకు మంజూరైన మెడికల్ కాలేజి ఏర్పాటు చేయాలని ఏఐఎఫ్డీఎస్, బీసీవీఎస్ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. బెల్లంపల్లి నియోజకవర్గంలో కాసిపేట, తాండూరు, బెల్లంపల్లిలోని వసతి గృహాల ప్రారంభోత్సవంలో భాగంగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రా రెడ్డికి బెల్లంపల్లి పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాలలోని వసతి గృహ ప్రారంభోత్సవంలో అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య(ఎ.ఐ.ఎఫ్.డి.ఎస్) జిల్లాకార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, బీసీవీస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లిసాగర్ ఆధ్వర్యంలో బెల్లంపల్లిలోనే మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ బెల్లంపల్లిని జిల్లా చేయకుండా అన్యాయం చేశారని, మెడికల్ కళాశాలనైన ఇచ్చి న్యాయం చేయాలన్నారు. బెల్లంపల్లిలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడానికి అన్నివిధాల అనుకులమైనదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ఆనాటి టీడీపి ప్రభుత్వం 1998లోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తూర్పు ప్రాంతంలోని అసిఫాబాద్, సిర్పూర్, చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజక వర్గాల్లోని పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించడాని బెల్లంపల్లిలో మెడికల్ కళాశాల మంజూరు చేసిందని, 62కోట్ల రూపాయల నిధులు కేటాయించి టెస్లా డైగ్నోస్టిక్ ఇంటర్నేషనల్ అనే ప్రయివేటు సంస్థకు నిర్మాణ బాధ్యతలు అప్పచెప్పిందని, దాదాపు 75 శాతం పని పూర్తయిందని అప్పటి కొంతమంది అధికారుల, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల మధ్యలోనే ఆగిపోయిందని, ఇటీవల నూతనంగా మంజూరైన మెడికల్ కళాశాలలో మంచిర్యాల జిల్లాల్లోని బెల్లంపల్లికి చోటు దక్కుతుందని ఇక్కడి ప్రజలు ఎంతో ఆశపడ్డారని కానీ ఈ ఆశలను అడియాసలు చేసి మంచిర్యాల కు తరలించారని, విద్యార్థి సంఘాలుగా చాలా ఉద్యమాలు, పోరాటాలు చేశామని,చివరకు మంచిర్యాల మార్కెట్ యార్డును మరమ్మతులు చేసి కోట్ల రూపాయలు ఖర్చు చేసి రేకుల షెడ్లను ఏర్పాటు చేశారని, దీనికి జాతీయ వైద్య కమిషన్(ఎన్.ఎమ్.సి)అభ్యంతరం తెలిపిందని, కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీళ్ళయ్యాయని, ఇవే డబ్బులు ఇక్కడ పెడితే తక్కువ ఖర్చులో కళాశాల ఏర్పాడేదని, ఎన్ ఎం సి అనుమతి వచ్చి బెల్లంపల్లిలో మెడికల్ కళాశాల ప్రారంభమయ్యేదని, తూర్పుప్రాంతంలోని నియోజక వర్గాల తో పాటు బెల్లంపల్లి అభివృద్ధి చెందేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మెడికల్ కళాశాల బెల్లంపల్లిలో ఏర్పాటు చేయాలని అన్నారు.