బోగస్‌ కార్డుల ఏరివేత జరిగేనా

ఆదిలాబాద్‌, ఆగస్టు 2 : జిల్లాలో బోగస్‌ తెల్ల రేషన్‌కార్డులను ఈ నెల 15వ తేదీనాటికి తేల్చాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో సుమారు ఐదున్నర లక్షల మంది కుటుంబాలు ఉండగా, అంతకుమించి తెల్ల రేషన్‌ కార్డులు ఉండడాన్ని అధికారులు గుర్తించడం జరిగింది. అధికారిక లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా మొత్తం ఆరున్నర లక్షల తెల్లకార్డులు ఉండగా, సుమారు 70వేల గులాబీ కార్డులు ఉన్నాయి. ప్రభుత్వం 15 రోజుల్లోగా బోగస్‌ రేషన్‌ కార్డుల తేల్చాలని ఉత్తర్వులు జారీ చేయడంతో ఇంత తక్కువ సమయంలో ఏరివేత కార్యక్రమం ఎలా నిర్వహించాలో అధికారులకు అంతుపట్టడంలేదు. గతంలో తెల్ల రేషన్‌ కార్డులను ఏరివేతకు అనేక కార్యక్రమాలు చేపట్టినప్పటికీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అధికారులు ఈ పనిచేయలేకపోయారు. ప్రభుత్వ నియమనిబంధనల ప్రకారం పట్టణ ప్రాంతంలో 70వేలు, గ్రామీణ ప్రాంతాలలో 75వేల వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు తెల్ల రేషన్‌ కార్డులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. 2009లో జరిగిన ఎన్నికల సమయంలో ఇష్టానుసారంగా అడిగిన వారందరికీ తెల్లరేషన్‌ కార్డులు ఇవ్వడంతో ఈ సమస్య నెలకొంది. కార్డులను ఏరివేసే సందర్భంలో రాజకీయ పార్టీలు, నాయకుల ఒత్తిళ్లకారణంగా ఈ కార్యక్రమం ముందుకు సాగడంలేదు. కార్డుల ఏరివేత కార్యక్రమానికి తక్కువ సమయం ఉండడం, మరో పక్క నాయకుల ఒత్తిళ్లతో ఈ కార్యక్రమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అధికారులకు అర్థంకావడంలేదు.