బోనకల్ లో “పోషణ పక్షం” సదస్సు

 బోనకల్ లో “పోషణ పక్షం” సదస్సు
చిరుధాన్యాలతో ఎంతో మేలు.. డిడబ్ల్యూఓ సంధ్యారాణి
బోనకల్, మార్చి 29,( జనంసాక్షి):ఖమ్మం జిల్లా మధిర ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో బోనకల్ 1, 2  సెక్టార్ల పరిధిలోని అంగన్వాడి టీచర్లు సంయుక్తంగా పోషణ పక్షం కార్యక్రమాలను స్థానిక బోనకల్ మండల కేంద్రంలోని రైతు వేదిక నందు ఏర్పాటు చేశారు. గర్భిణులు ,బాలింతలు, బాలికలు, చిన్నారుల్లో పౌష్టికాహార లోపం అధిగమించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ్‌ పక్వాడా(పోషణ పక్షం) నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం  బోనకల్ మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదిక నందు పోషణ పక్షం కార్యక్రమాల్లో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాల పోషకాహార వంటలు తయారుచేసి స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రదర్శించారు ,అదేవిధంగా శ్రీమంతాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా సంక్షేమ అధికారిని సంధ్యారాణి ముఖ్యఅతిథిగా హాజరైనారు . ఈ సందర్భంగా డి డబ్ల్యు ఓ సంధ్యారాణి మాట్లాడుతూ లబ్ధిదారులు, తల్లులకు పోషణ విలువలు, అదనపు ఆహార విశిష్టత, తల్లి పాల ఆవశ్యకత, రక్తహీనత తదితర అంశాలపై అవగాహన కల్పించారు.  పౌష్టికాహార లోపంతో బాధపడే చిన్నారులను గుర్తించి తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. వంటల పోటీలు, పోషకాహార ప్రభాతభేరి, పోషణ ర్యాలీలు, యోగాపై అవగాహన, కిచెన్‌ గార్డెనింగ్‌ వంటివి నిర్వహిస్తున్నామన్నారు .పౌష్టికాహారలోపం లేని గ్రామం, సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా సరైన పోషణ, పౌష్టికాహారం, తాగునీరు పరిశుభ్రతపై అంగన్‌వాడీ టీచర్లు అధికారులు అవగాహన కల్పిస్తున్నారనీ అన్నారు. ఈ సందర్భంగా మధిర సిడిపిఓ శారద శాంతి మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందే సేవలను పూర్తిస్థాయిలో లభ్ధిదారులకు తెలియపరిచేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు .ఖాళీ ప్రదేశం ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో పెరటి తోటల పెంపకం, పెంచే మొక్కలను పెంచే విధంగా కృషి చేస్తున్నామన్నారు. చిన్నారులు, కిశోర బాలికలు, బాలింతలను పోషకాహారలోపం నుంచి విముక్తులను చేయడం ఆరోగ్యవంతులను చేయడానికి పోషణ్‌ పక్వాడా దోహదపడనుంది.పోషన్‌ పక్వాడా లో ప్రధానాంశాలు ప్రజల్లోకి వెళ్లే లా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. పదిహేను రోజుల పాటు జరిగే కార్యక్రమంలో అనేక విషయాలను ప్రజల వద్దకు చేరేలా చర్యలు తీసుకుంటున్నాం. అంగన్వాడీ టీచర్లంతా తమ కేంద్రం పరిధిలో విజయవంతం చేసేలా శిక్షణ ఇచ్చాం అని అన్నారు.మాత, శిశువు ఆరోగ్యంగా ఉంటేనే భవిష్యత్తు భారతావని బలంగా ఉంటుంది. దీన్ని దష్టిలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతుంది. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సరైన పౌష్టికాహారం అందించేందుకు ప్రాధాన్యనిస్తున్నాయి. చిన్నారులు, గర్భిణుల్లో రక్తహీనత నివారణకు పోషన్‌ అభియాన్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పతిఏటా మార్చిలో 15 రోజుల పాటు పోషన్‌ పక్వాడా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.గర్భిణులు, బాలింతలు, చిన్నారుల పోషణ స్థాయిని మెరుగుపరచడంలో పురుషుల భాగస్వామ్యం ప్రాముఖ్యతను పెంచడం, శిశువు పుట్టినప్పటి నుంచి వెయ్యి రోజుల వరకు శిశు పోషణ, పౌష్టికాహారం, ఆహార వైవిధ్యం, రక్తహీనత, విరేచనాల నివారణ, పరిశుభ్రతపై ప్రధాన ప్రచార అస్త్రాలుగా పోషన్‌ పక్వాడా కార్యక్రమాలు చేపడుతున్నారు.భార్యాభర్తలకు వంటల పోటీలు నిర్వహించి గర్బిణులు బాలింతలు చిన్న పిల్లలు ఉన్న మహిళలకు భర్తల సహకారం ఎంత అవసరమో సవివరంగా వివరిస్తారు. పనిచేసే కార్మిక మహిళలకు సైతం వారి భర్తల సహకారం గురించి అర్థమయ్యేలా చెబుతారు. కూరగాయల సాగు, విద్య మీద, అంగన్‌ వాడి కేంద్రాలు, పాఠశాలలు కళాశాలల తోపాటు హాస్టల్స్లో ఎలా ఏర్పాటు చేయాలో వివరిస్తారు. ఈ సందర్భంగా మనకు స్థానికంగా దొరికే చిరుధాన్యాలు వాటి యొక్క పోషక విలువల గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి పోషణ పక్షం కార్యక్రమాలను అనుసరించి అంగన్వాడీ కేంద్రాలను ఉపయోగించుకొని వారి సూచనల మేరకు పోషక ఆహారాన్ని తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డి డబ్ల్యు ఓ సంధ్యారాణి, సిడిపిఓ శారద శాంతి ,ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, డాక్టర్ స్రవంతి , ఏపీవో పద్మలత ,ఏసీడీపీఓ కమల ప్రియ , వైస్ ఎంపీపీ రమేష్,సూపర్వైజర్ రమాదేవి, పలువురు ప్రజా ప్రతినిధులు స్థానిక అధికారులు, అంగన్వాడీ టీచర్లు ,ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.