భర్తను కడతేర్చిన భార్య
నూజండ్ల : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను ప్రియుడితో కలిసి భార్య హత్య చేసిన సంఘటన నూజండ్లలో శనివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు, మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నకరికల్లు మండలం చేజర్లకు చెందిన పోట్లూరి అమరలింగయ్య(32)కు అదే ప్రాంతానికి చెందిన కృష్ణవేణితో పదమూడేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు సంతానం. అమరలింగయ్య దంపతులు ఉపాధి నిమిత్తం నాలుగు నెలల క్రితం నూజండ్లలో ఓ కోళ్లఫారంలో పని చేస్తున్నారు. అయితే కృష్ణవేణికి స్థానికంగా ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటంతో దంపతులిద్దరు కొంతకాలంగా గొడవపడుతున్నారు. శనివారం రాత్రి కూడా వారు ఈ విషయమై గొడవపడినట్లు అక్కడి వారు చెబుతున్నారు. శనివారం అర్ధరాత్రి తన భర్త హత్యకు గురైనట్లు కృష్ణవేణి కోళ్లఫారం యాజమానికి ఫోన్ ద్వారా సమాచారం అందించింది. పోలీసులకు తెలపడంతో రంగంలోకి దిగిన గ్రామీణ సీఐ. టి.వి.శ్రీనివాసరావు, ఎస్‌ఐ విజయచరణ్ విచారణ చేపట్టారు. అమరలింగయ్యకు ఒంటిపై గాయాలుండటంతో పాటు కిరాతకంగా కత్తితో పొడిచి చంపారు. చంపేందుకు వినియోగించిన కత్తి కడుపులో దిగబడే ఉంది. పోలీసులు క్లూస్‌టీంను పిలిపించారు. సంఘటనా స్థలంలో వేలిముద్రలు సేకరించారు. కృష్ణవేణి కదలికలు అనుమానాస్పదంగా ఉండటం, చేతికి రక్తపు మరకలు ఉండటంతో హత్య వెనుక ఆమె ప్రమేయం ఉంటుందని పోలీసులు గుర్తించారు.అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సమాచారం అందుకున్న అమరలింగయ్య బంధువులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అమరలింగయ్యను భార్య కృష్ణవేణి చంపిందని ఆరోపించారు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్య వెనుక భార్యతో పాటు ఎవరి ప్రమేయం ఉందనే దానిపై విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. భార్య వేలిముద్రలతో సరిపోల్చాల్సి ఉందని పేర్కొన్నారు.