భాజపాతోనే తెలంగాణ సాధ్యం
అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రం ఏర్పాటు
కిషన్‌రెడ్డి దీక్ష ముగింపు సభలో సుష్మాస్వరాజ్
న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ వల్ల తెలంగాణ రాష్ట్రం సాధ్యం కాదని భాజపా అగ్రనేత సుష్మాస్వరాజ్ అన్నారు. ఢిల్లీలో రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేపట్టిన దీక్ష ముగింపు కార్యక్రమానికి ఆమె హాజరై ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం భాజపాతోనే సాథ్యమని స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఎంతో దూరంలో లేదని అన్నారు. కేంద్రంలో ఎన్టీఏ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని వెల్లడించారు. తెలంగాణపై ఎన్నికల్లో ఇచ్చిన హామిని కాంగ్రెస్ బుట్టదాఖాలు చేసిందని విమర్శించారు. తెలంగాణ అంశంలో కాంగ్రెస్‌ను పదేపదే నమ్మడం మంచిది కాదని తెరాస అధినేత కేసీఆర్‌కు భాజపా నేతలు చెప్పాలని సూచించారు. ప్రత్యేక తెలంగాణ కోసం ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారని.. ప్రజల ఆకాంక్షను కేంద్రం గౌరవించాలని కోరారు.