భారత్‌పై అంతర్జాతీయ మాంద్య ప్రభావం

న్యూఢిల్లీ, జూలై 13 : అంతర్జాతీయ ఆర్థికమాంద్యం సంభవించటంతో భారత్‌లో విదేశీ పెట్టుబడులకు ఆటంకం కలగటమే కాక దేశీయ కార్పొరేట్‌సంస్థల విస్తరణపై కూడా ప్రభావం చూపింది. ఆర్‌బీఐ తాజా గణాంకాల ప్రకారం పెట్టుబడుల రాక-పోక మధ్య 37 శాతం అంతరం పెరిగింది. 2012 ఏప్రిల్‌, మే మాసాల్లో 3.2 బిలియన్ల డాలర్ల వానిజ్యలోటు ఏర్పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ)లో పెద్దగా తేడాలేదు. 2011 మేలో ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది. దేశంలోనికి విదేశీపెట్టుబడులు 4.3 బిలియన్ల డాలర్లకు పడిపోయాయి. ఇక విదేశాలలో భారత్‌ కార్పొరేట్ల పెట్టుబడులు కూడా తగ్గిపోయాయి. 2012 ఫిబ్రవరిలో భారత్‌ విదేశీపెట్టుబడులు 1.3 బిలియన్‌ డాలర్లు కాగా, మే నెలకు 500 మిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. ఇక విదేశీ సంస్థాగత ఇన్వెష్టర్లు కూడా తమ పెట్టుబడులను తగ్గించుకుంటున్నారు. అందువల్ల కరెంట్‌ ఖాతాలకు ద్రవ్యలోటు ఏర్పడుతోంది. డాలర్‌ విలువ పెరగటం రూపాయి విలువ తగ్గటం ఈ మాంద్యానికి కారణాలయ్యాయి.