భోగాపురం ఎయిర్‌పోర్ట్ కు వేగంగా అడుగులు
విజయనగరం: జిల్లాలోని భోగాపురం మండల తీరప్రాంతంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ కోసం జిల్లా యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఎయిర్‌పోర్టు నిర్మాణ స్థలాన్ని కేంద్ర బృంద సభ్యులు పరిశీలించారు. భూసేకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు 12 గ్రామాల పరిధిలో 15 వేల ఎకరాల భూములను సేకరించాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.
ల్యాండ్ పూలింగ్ చేపట్టేందుకు అధికారుల వ్యూహం
భూసేకరణ కోసం కలెక్టర్ పలువురు అధికారులతో బృందాలను ఏర్పాటు చేశారు. ఎయిర్‌పోర్ట్ కోసం భూసమీకరణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎయిర్‌పోర్ట్ వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాలను వారికి వివరిస్తున్నారు. ఇంకా స్థానికుల నుంచి ఎలాంటి ఇబ్బందులైనా ఎదురైతే నవ్యాంధ్రప్రదేశ్ రాజధానికి చేపట్టిన భూసమీకరణ తరహాలో ల్యాండ్‌పూలింగ్ చేపట్టాలని అధికారులు వ్యూహం రచిస్తున్నారు. ఇదేగనుక అమల్లోకి వస్తే భూమిపై ఆధారపడే వ్యవసాయ కార్మికులకు, వృత్తిదారులకు అన్యాయం జరుగుతుందని పలువురంటున్నారు.
ల్యాండ్‌పూలింగ్‌తో హరించుకుపోనున్న హక్కులు
వాస్తవానికి ఏదైనా ప్రాజెక్ట్ కోసం భూసేకరణ చేపడితే ముందుగా గ్రామసభలు ఆమోదం తెలిపాల్సి ఉంటుంది. ఆ తర్వాత నిర్వాసితులకు మార్కెట్ విలువపై నాలుగు రెట్లు అధికంగా పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ.. ల్యాండ్‌పూలింగ్ అమలు చేస్తే ఆ హక్కులన్నీ హరించుకుపోతాయి. కానీ ఎలాగైనా ఇదే విధానాన్ని అవలంబించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అవసరమైతే పోలీసు బలగాలను రంగంలోకి దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు కన్పిస్తోంది. ఇక కేంద్రమంత్రి అశోక్‌గజపతి రాజు మాత్రం.. పెరుగుతున్న ప్రజల అవసరాలరీత్యా భోగాపురంలో ఎయిర్‌పోర్ట్ నిర్మించాల్సిన అవసరముందంటున్నారు.
ఎయిర్‌పోర్ట్ నిర్మాణంపై స్థానికులు తీవ్ర నిరసన
మరోపక్క ఎయిర్‌పోర్ట్ నిర్మాణంపై స్థానికుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఎయిర్‌పోర్ట్ కోసం 15 వేల ఎకరాల భూమి ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే దీనిపై అఖిలపక్ష నేతలు సమావేశమై.. ప్రజల తరపున పోరాడేందుకు సిద్ధమవుతున్నారు.