మంచినీటి సమస్యను పరిష్కరించాలి

వైయస్‌ఆర్‌ సిపి నేత వినయ్‌కుమార్‌ డిమాండ్‌
మార్కాపురం , జూలై 10 : తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా బోర్లు పనిచేయక పోవడంతో మంచినీటి కోసం తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కావున వెంటనే ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయాలని కోరుతూ పట్టణంలోని గుండ్లకమ్మ నది పరివాహక నివాస వాసులు స్థానిక మునిసిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైయస్‌ఆర్‌ సిపి నేత తాటిశెట్టి వినయ్‌కుమార్‌ మాట్లాడుతూ ఆ ప్రాంతంలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని గతంలో అనేక సందర్భాలలో ఆందోళనలు చేసినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శించారని దీంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కావున ఇప్పటికైనా ఆ ప్రాంత ప్రజల దాహార్తిని దృష్టిలోఉంచుకొని ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయాలని మునిసిపల్‌ అధికారులను డిమాండ్‌ చేశారు. తమ సంస్థ ద్వారా ఇప్పటికే పట్టణంలో అనేక ప్రాంతాలలో ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తూ దాహార్తిని తీరుస్తున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం పై సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని మునిసిపల్‌ అధికారులకు అందచేశారు.