మండలి రద్దు ఓ మంచి నిర్ణయం

share on facebook

రాజకీయ పునరావాసానికి కేంద్రంగా ఉన్న అన్ని వ్యవస్థలకు మంగళం పాడడం ద్వారా ప్రజల డబ్బులను ఆదాచేయాలి. వాటిని అభివృద్దికి కేటాయించాలి. గతంలో ఎన్టీఆర్‌ కాలంలో రద్దు చేసిన మండలిని పునరుద్దరించడమే తప్పు. పునరుద్దరించిన మండలితో ప్రజలకు ఒరిగిందేవిూ లేదు. నేరుగా ఎన్నిక కాలేని వారిని మండలిలోకి తీసుకుని వచ్చే యత్నాలతో లాభం లేదని నిరూపితం అయ్యింది. ఇప్పుడు ఎపిలో వైకాపా సర్కార్‌ తీసుకున్న మండలి రద్దు నిర్ణయం నూటికి నూరుపాళ్లు సరైన నిర్ణయంగా స్వాగతించాలి. కారణమేదైనా సమాజానికి పనికిరాని వ్యవస్థలను రద్దు చేయాల్సిందే. గవర్నర్‌ వ్యవస్థ కూడా ఇందులో ఉంది. జడ్పీటీసీ, ఎంపిటిసి లాంటి వ్యవస్థలను కూడా తొలగించాలి. ప్రజల డబ్బుతో రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులను మేపడానికి ఉద్దేశించిన వ్యవస్థలను పెకిలించాలి. నిజానికి మండలితో వచ్చే ఉపయోగం లేదు. కొందరికి పదవులు కట్టబెట్టం మినహా ఎందుకూ పనికి రాదు. ఈ విషయంలో జగన్‌ బాటలో అన్ని రాష్టాల్రు ముందుకు నడవాలి. కేంద్రం కూడా ఈ మండలి వ్యవస్థను రద్దు చేస్తే మంచిది. గవర్నర్‌,మండలి, జడ్పీటీసీ,ఎంపిటిసిలతో పాటు రాజకీయ పునరావసాలకు అవకాశం కల్పించే ఎలాంటి పదవును కూడా చేప్టకుండా చట్టాలుచేయాలి. అప్పుడే అభివృద్ధికి ఆస్కారం ఏర్పడు తుంది. మండలి రద్దుపై టిడిపి మాట్లాడుతున్న తీరు దారుణం కాక మరోటి కాదు. ఎన్టీఆర్‌ అడుగుజాడల్లో నడుస్తామంటున్న వారు మండలి రద్దు నిర్ణయాన్ని స్వాగతించాలి. చంద్రబాబు బృందం రెండునాల్కల ధోరణిని విడనాడాలి. కారణమేదైనా మండలి రద్దుకు జగన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సాహసోపేతంగానే చూడాలి. తన పార్టీ వారికి పదవుల పందేరానికి అవసరమైన అవకాశం ఉన్నా దానిని తృణీకరించి ముందుకు సాగడం సరైన నిర్ణయం. మండలి రద్దు నిర్ణయంపై కేంద్రం ఏం చేయబోతున్నదో చూడాలి. తీర్మానాన్ని ముందు కేంద్రమంత్రివర్గం, అనంతరం పార్లమెంటు ఉభయసభలూ ఆమోదించిన పక్షంలో అది రాష్ట్రపతికి చేరి, అంతిమంగా చట్టం అవుతుంది. కేంద్రంలో మెజారిటీ పార్టీగా ఉన్న బిజెపి తక్షణమే ఇందుకు అనుగుణంగా స్పందించాలి. మరొకపక్క శాసనమండళ్ళకు సంబంధించి ఒక జాతీయస్థాయి విధానాన్ని తేవాలన్న ఆలోచనను కేంద్రం చేస్తే మంచిది. ఇకపోతే మండలి రద్దుపై చంద్రబాబు, ఆయన బృందం రెండునాల్కల ధోరణితో ఉన్నాయి. గతంలో రద్దుకు సై అన్నవారు ఇప్పుడు తమవారి రాజకీయ పునరావాసం పోతుందన్న బాధలో రద్దును వద్దంటున్నారు. శాసనమండలి ఉండాల్సిందేనని ఇప్పుడు చెబుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, 2004లో మండలి వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని స్పష్టంగా చెప్పారు. శాసనాలు ఆలస్యం అవుతాయని పేర్కొన్నారు. 2004 శాసనమండలి పునరుద్ధరణ బిల్లును వ్యతిరేకిస్తూ చంద్రబాబు అప్పుడు మాట్లాడారు. అప్పుడోమాట ఇప్పుడో మాట సరికాదు. శాసనమండలి పునరుద్ధరించాలనే నిర్ణయం వల్ల కాంగ్రెస్‌ కొంతమందికి రాజకీయ పునరావాసం కల్పిస్తారేమో గానీ.. దీనివల్ల రాష్టాన్రికి, ప్రజలకు ఏం లాభం లేదని ఆనాడు వ్యాఖ్యానించారు. శాసన మండలికి మేధావులను పంపడం ద్వారా వివిధ అంశాలను చర్చించాలన్న ఉద్దేశం ఉండేది. అయితే దానివల్లా ప్రయోజనం లేదని తేలింది. ఇకపోతే 1934 అక్టోబర్‌ 26న బాబూ రాజేందప్రసాద్‌ అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ, దీనివల్ల ఏమాత్రం లాభం ఉండదని, నష్టం ఉంటుందని, ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని, శాసనాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పారు. 1950 నుంచి చూస్తే… 8 రాష్టాల్ల్రో మాత్రం రెండు సభలొచ్చాయి. కాలక్రమేణా మూడు రాష్టాల్ల్రో రద్దయ్యి ఐదు రాష్టాల్లో మాత్రం మండలి ఉంది. మండలి వల్ల రూ.20 కోట్లు ఆర్థిక భారం పడుతుంది. బిల్లుల ఆమోదంలో కాలయాపన జరుగుతుందని ఆనాడు చంద్రబాబు అంగీకరించారు. అసెంబ్లీ నుంచి ఒక బిల్లు పంపిస్తే అక్కడికి పోవడం, తిరిగొస్తే మళ్లీ చర్చించడంతో కాలయాపన జరుగుతూ వచ్చింది. ఆర్థిక సంబంధమైన బిల్లుల విషయంలో మండలికి పటిష్టమైన అధికారాలు లేవు. ఈ బిల్లులన్నీ శాసనసభే ఆమోదిస్తుంది. ఏదైనా బిల్లును చట్టం కాకుండా అడ్డుకునే శక్తి మండలికి నాలుగు నెలలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత దానంతట అదే చట్టమవుతుంది. ఏవైనా రాజ్యాంగ సవరణలు చేయాల్సి వస్తే అసెంబ్లీ తప్ప మండలికి ఏమాత్రం అధికారం లేదు. ఆఖరుకు రాష్ట్రపతి ఎన్నికల విషయంలోనూ మండలి సభ్యులకు ఓటింగ్‌ హక్కు లేదు. పరిమిత అధికారాలు తప్ప ఏవిూ మండలికి ఉండవు. ప్రజాధనం దుర్వినియోగం చేసే మండలి బిల్లు వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ. ఇకపోతే ఎంపిటిసిలు,జడ్పీటిసిలు కూడా అలాగా మారాయి. రాజకీయ పునరావాసానికి ఈ పదవులు వచ్చాయి. వీరికి చట్టబద్దమైన హక్కులు లేవు. అందువల్ల ఇలాంటి పదవులకుమంగళం పాడాల్సిన అవసరం ఉంది. ఎపి మండలి రద్దు నేపథ్యంలో సర్వత్రా ఇప్పుడు ఇలాంటి ప్రజాధనం దుర్వినియోగం అవుతున్న పదవులపై చర్చ సాగాలి. అలాగే అదేపనిగా ప్రభుత్వం సలహాదారులను నియమించు కుంటోంది. ఇలాంటి చర్యలను కూడా అంతా వ్యతిరేకించాలి. దీనిపై కేంద్రమే ఓ నిర్ణయం తీసుకోవాలి. ప్రజాధనం వృధా అవుతున్న అనేక సంస్థలను తుదముట్టించాలి. ఆర్థిక మాంద్యానికి, విపరీత ఖర్చులకు కళ్లెం వేయాలి. సిఎంలు వారి ఇష్టానుసారం ఖర్చుచేసే పద్దతికి కూడా స్వస్తి పలకాలి. పాలనంటే కేవలం రాజకీయాలు, వ్యక్తులకు పదవుఉల ఇవే కాదని గుర్తించాలి. అప్పుడే భారతదేశం ముందుకు వెళ్లగలదు.

Other News

Comments are closed.