మంత్రి కేటీఆర్ బహిరంగ చర్చకు రావాలి.

మంత్రి కేటీఆర్ బహిరంగ చర్చకు రావాలి.
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లగిశెట్టి  శ్రీనివాస్.
కేంద్రం ఇచ్చే నిధులు లెక్కలతో సహా చూపిస్తాం..
కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణుల ఆగ్రహం.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. మార్చ్ 28. (జనంసాక్షి). కేంద్రం ఇచ్చే నిధులపై లెక్కలతో సహా తాము చూపించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి కేటీఆర్ బహిరంగ చర్చకు రావాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లగిశెట్టి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మీడియా సమావేశంలో బిజెపి నాయకులతో కలిసి శ్రీనివాస్ మాట్లాడారు. సోమవారం సిరిసిల్ల లో నిర్వహించిన బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ప్రధాని మోడీ పట్ల చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. కేంద్రం రాష్ట్ర అభివృద్ధి కోసం కేటాయిస్తున్న నిధులపై లెక్కలతో సహా చూపించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. మంత్రి కేటీఆర్ కు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీని కానీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పట్ల మరోసారి  ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. కేటీఆర్ ప్రచారం చేసుకుంటున్నా రైతు వేదికలు, స్మశాన వాటికలు, గ్రామపంచాయతీల అభివృద్ధి కోసం ఇస్తున్న నిధులు 14వ ఆర్థిక సంఘం నిధులని ఈ విషయం కేటీఆర్ కు తెల్వదా అని విమర్శించారు. రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఏబీవీపీ నాయకులు మంత్రి కేటీఆర్ ను అడ్డుకుంటే సమాధానం చెప్పకుండా నాయకులను వేధించడం సరికాదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వైపల్యం వల్లే విద్యార్థులు క్షోబా పడుతున్నారని తెలిపారు. కనీసం విద్యాశాఖ మంత్రి ఈ విషయంలో నోరు మెదపడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి మెగా టెక్స్టైల్ పార్క్ మంజూరు చేసిందని ఈ విషయంలో ఎక్కడ ఏర్పాటు చేశారు రాష్ట్ర ప్రభుత్వమే స్పష్టత ఇవ్వాలని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.మరోసారి ప్రధాని మోడీ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని తెలిపారు. సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవు నూరి రమకాంత్ రావు, ఆడెపు రవీందర్, పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్. రెడ్డబోయిన గోపి, చేన్నమనేని కమలాకర్ రావు, గూడూరు భాస్కర్, నాగరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.