మందకృష్ణ తెలంగాణ ద్రోహి: సుమన్
హైదరాబాద్: ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ తెలంగాణ ద్రోహి అని టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ కావాలో వద్దో మందకృష్ణ స్పష్టం చేయాలని సుమన్ డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. మందకృష్ణ మాదిగల నాయకుడిగా కాకుండా టీడీపీ నేతగా వ్యవహరిస్తున్నాడని, సమైక్యవాదుల చేతిలో కీలు బొమ్మగా మారాడని విమర్శించారు. మందకృష్ణ నారా కృష్ణగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మందకృష్ణ నిజస్వరూపం బయటపడిందని ఆయన తెలియజేశారు. ఇప్పటికే మాదిగలంతా మందకృష్ణకు దూరమయ్యారని అన్నారు. మందకృష్ణ తమ అధినేత కేసీఆర్‌ను విమర్శించడం మానుకోవాలని, లేకుంటే మాదిగలే ఆయనకు బుద్ది చెబుతారని బాల్క సుమన్ హెచ్చరించారు. కాగా, టీడీపీ నేత మోత్కుపల్లి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, తమ అధినేతనే విమర్శిస్తే ఊరుకునేదిలేదని సుమన్ ఘాటుగా అన్నారు.



