‘మనగుడి’ సంబరాలకు రూ. 5 లక్షల విడుదల

శ్రీకాకుళం, ఆగస్టు 2 : రాష్ట్ర దేవాదాయశాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రావణ పూర్ణమి మనగుడి సంబరాలకు జిల్లాకు సంబంధించి రూ. 5 లక్షలు విడుదల చేసినట్లు టిటిడి అధికారి, మనగుడి జిల్లా ఇన్‌ఛార్జి పి.బాలరాజ్‌ తెలిపారు. ఈ మొత్తం ఫ్లెక్సీబోర్డులు, బ్యానర్లు, జిల్లాకు వచ్చిన టిటిడి అధికారులకు వాహనాల డీజిల్‌, పెట్రోల్‌ ఖర్చులకు వనియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే రూ. 3.5 లక్షలు ఖర్చు చేశామని, మిగతా సొమ్మును టిటిడికి చలానా రూపంలో అప్పజెప్పనున్నట్లు తెలిపారు.
మనగుడి సంబరాలపై విమర్శలు: జిల్లాలో మనగుడి సంబరాలకు సంబంధించి చిన్నపాటి విమర్శలు వినిపిస్తున్నాయి. టిటిడి పంపించిన కరపత్రాలు, చిన్న బ్యానర్లు కొన్న ప్రసిద్ధ ఆలయాల్లో తప్ప మరెక్కడా కనిపించడంలేదు. బ్యానర్లు 500, ఫెక్సీలు 45 తెచ్చామని టిటిడి అధికారులు చెబుతున్నప్పటికీ జిల్లా కేంద్రంతో పాటు పట్టణాల్లో వాటి జాడలేదు. మనగుడి సంబరాలు ప్రచారంలో అంతగా శ్రద్ధ చూపింపలేదన్న విమర్శలూ ఉన్నాయి. టిటిడి నుంచి దేవతా వస్త్రాలతో పాటు వచ్చిన ప్రసాదం బాక్కులు కొన్ని మాత్రమే రాగా మిగతా దేవతా వస్త్రాలు జిల్లాలోనే కొన్నట్లు తెలుస్తోంది. సుమారు 375 దేవాలయాల్లో మనగుడి నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా ఆలయాల్లో దేవతా వృక్షాలు నాటాల్సి ఉండగా విశాఖకు చెందిన 52 చెట్లు మాత్రమే వచ్చాయని తెలుస్తోంది.