మరమ్మతులు పూర్తికాని థాయ్‌ విమానం

హైదరాబాద్‌: సాంకేతిక లోపంతో గత అర్థరాత్రి నుంచి శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆగిపోయిన థాయ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాకికి మరమ్మతులు ఇంకా పూర్తి కాలేదు. 300మంది ప్రయాణికులతో బ్యాంకాక్‌ బయలుదేరిన ఈ విమానంలోని ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రమాదాన్ని గుర్తించిన పైలట్‌ టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే శంషాబాద్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా దించేశారు. ప్రమాదాన్ని ముందస్తుగా గుర్తించడంతో పెనుప్రమాదం తప్పింది. అయితే గత అర్థరాత్రి నుంచి విమానానికి మరమ్మతులు చేస్తున్నా ఇంకా పూర్తి కాకపోవడంతో బ్యాంకాక్‌ నుంచి నిపుణులను రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బ్యాంకాక్‌ వెళ్లాల్సిన ప్రయాణికులు శంషాబాద్‌ నోవాటెల్‌ హోటల్‌లో పడిగాపులు కాస్తున్నారు.