మహాదీక్ష పేరుతో మరో డ్రామా !

విజయమ్మా నిన్నెవరు పిలిచారమ్మ ?
సీమాంధ్ర నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు ఆమోదించరు
ఆత్మగౌరవ గడ్డపై పరామర్శల పేరుతో పరాచకం
తెలంగాణవాదుల ఆగ్రహం
కరీంనగర్‌,జూలై 15(జనంసాక్షి):
విజయమ్మ సిరిసిల్లలో ఈనెల 23న నేత కార్మికుల సమస్యలపై మహాదీక్ష చేయనున్నట్లు ప్రకటించగానే తెలంగాణ మొత్తం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆత్మగౌరవ గడ్డపై సీమాంధ్ర నాయకులు పరామర్శల పేరుతో పరాచకాలా డుతున్నారని ఆగ్రహం వ్యక్తమవు తున్నది. సీమాంధ్రులు తెలంగాణ ప్రజలను బుజ్జగించి తమ స్వార్థ ప్రయోజనాలను కాపాడుకోవాలని చూస్తున్నారని తెలంగాణవాదులు మండిపడు తున్నారు. వైఎస్సార్‌ కుటుంబానికి ఇంతకాలం గుర్తుకు రాని నేతన్నలు ఇప్పుడు గుర్తుకు వచ్చారా అని ప్రశ్నిస్తున్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే నేత కార్మికులు తీవ్ర వివక్షకు గురయ్యారని, ఆయన హయాంలోనే సిరిసిల్ల ఉరిసిల్లగా మారిందని మండిపడుతున్నారు. ఇంత కాలం గుర్తుకు రాని సిరిసిల్ల నేత కార్మికులు జగన్‌ పార్టీ పెట్టి, ఆ తర్వాత అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లగానే గుర్తుకు వచ్చారా అని నిలదీస్తున్నారు. జగన్‌కు సానుభూతి సంపాదించడం కోసమే విజయమ్మ ఈ మహాదీక్ష చేయడానికి పూనుకున్నదని
విమర్శిస్తున్నారు. రాజన్న రాజ్యం తెస్తామని పదే పదే చెబతున్న విజయమ్మ వైఎస్‌ కాలంలో జరిగిన నేత కార్మికుల ఆత్మహత్యలను మళ్లీ తేవాలని చూస్తున్నదని తెలంగాణవాదులు ఎద్దేవా చేస్తున్నారు. తెలంగాణ భూములను, వనరులు అత్యధికంగా కొల్లగొట్టిన ఘనత వైఎస్‌ రాజశేఖరరెడ్డికే దక్కుతుందన్నారు. జగన్‌ కొల్లగొట్టిన వేల కోట్ల ప్రజాధనంలో సిరిసిల్లకు కొంతైనా ఇస్తే ఇక్కడి నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం మానుకుంటారని హేళన చేస్తున్నారు. దీక్ష చేపట్టే లోపు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఏర్పాటుపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని తెలంగాణవాదులు డిమాండ్‌ చేస్తున్నారు. లేకుంటే, సిరిసిల్లలో దీక్ష మాట దేవుడెరుగు, ఇక్కడ దీక్ష చేయడానికి వస్తే నేత కార్మికులే విజయమ్మను నిలదీస్తారని అంటున్నారు. మహబూబాబాద్‌లో తన కొడుకు జగన్‌కు పరాభవాన్ని విజయమ్మ మరిచినట్లుందని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. మరోవైపు టీఆర్‌ఎస్‌ అధినేత కొడుకు, ఆ పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ సిరిసిల్లకే ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్‌ ఏరియాలో విజయమ్మ దీక్ష చేయడం సాహసమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని బలపరుస్తున్నట్లు స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు విజయమ్మను దీక్షను అడ్డుకుంటామని ప్రకటించారు. సిరిసిల్ల మరో మరో మహబూబాబాద్‌ కానున్నదా అనే కోణంలో రాజకీయ మేధావులు అంచనాలు వేస్తున్నారు.