మహిళా శాసనసభ్యురాలి ఇంట్లో అర్ధరాత్రి సోదాలా? తెదేపా
హైదరాబాద్: పరిటాల సునీత ఇంట్లో అర్థరాత్రి సోదాలు నిర్వహించి పోలీసులు ఓ మహిళ శాసనసభ్యురాలి గౌరవానికి భంగం కలిగించారని తెదేపా నేతలు మండి పడ్డారు. నేరస్తుడిమాటలు నమ్మి మహిళా ఎమ్మెల్యే పట్ల పోలీసులు ప్రవర్తించే తీరు ఇదేనా అని వారు నిలదీశారు. ఓ మహిళా హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో భర్తను కోల్పోయిన తోటి శాసనసభ్యురాలిని ఇలా అగౌరవించడాన్ని వారు తీవ్రంగా తప్పుబట్టారు. దీనికి ముఖ్యమంత్రి , స్పీకర్,డీజీపీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పరిటాల సునీత ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు ఏం సాధించారని వారు. ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెదేపా శ్రేణులపై ఏదోవిధంగా దాడులు చేయిస్తున్నారని దుయ్యబట్టారు. సెర్చ్‌వారంట్, సభాపతి అనుమతి లేకుండా పోలీసులు అర్ధరాత్రి సోదాలు ఎలా నిర్వహించారో సమాధానం చెప్పాలని తెదేపా నేతలు పెద్దిరెడ్డి, చంద్రశేఖర్ తదితరులు డిమాండ్ చేశారు.