మిలిటెంట్‌ ఉద్యమాలను నిర్వీర్యం చేస్తున్న

రాజకీయ పార్టీలను తరిమికొట్టండి
– మావోయిస్ట్‌ సుధాకర్‌
వరంగల్‌, ఆగస్టు 19 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజల ఓటు బ్యాంకు కోసం మిలిటెంట్‌ ఉద్యమాలను నీరుగారుస్తున్న కాంగ్రెస్‌ టీఆర్‌ఎస్‌, టీడీపీ, బీజేెపీలను తరిమికొట్టాలని కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల కె.కె.డబ్ల్యూ కార్యదర్శి సుధాకర్‌ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్మలకు ఈ పార్టీలే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రజలను పోరాటాల నుండి పక్కదారి పట్టించి ఎన్నికల కోసం ఆధికార దాహంతో గ్రామాలకు వస్తున్న పార్టీల ఎత్తుగడలను తిప్పికొట్టాలన్నారు. ఆత్మహత్యలతో తెలంగాణ రాదని పోరాటాలతోనే వస్తుందని సుధాకర్‌ పేర్కొన్నారు. దశాబ్ద కాలంగా టీఆర్‌ఎస్‌ రాజీనామాలు, పొత్తులు, ఎత్తులనే తమ పార్టీ అజెండాగా మార్చుకుని తెలంగాణ ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తున్నదని మండిపడ్డారు. 2004 లో కాంగ్రెస్‌తో, 2009లో తెలుగుదేశంతో పోత్తు పెట్టుకుని కేసీఆర్‌ ఏం సాధించాడో తెలంగాణ ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల వనరులుగా వాడుకుంటున్నారని సుధాకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మిలిటెంట్‌ ఉద్యమాలను విధ్వసం చేసి తెలంగాణ ప్రజలను ఓటు బ్యాంకుగా చేసుకోవడంలో కాంగ్రెస్‌, టీడీపీ, టీఆర్‌ఎస్‌, బీజేపీలు పోటీి పడుతున్నాయని ఆయన ఆరోపించారు. ఉద్యమం చేయకుండా ప్రాంతీయ పార్టీలు అత్యధిక సీట్లు గెలిచినా తెలంగాణ అంశం కొలిక్కి రాదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని విలువైన
భూములను సీమాంధ్రులు కబలించారని, అటవీ ఖనిజ సంపద జల వనరులు, విద్య, ఉపాధి అవకాశాలు కొల్లగొట్టారని సుధాకర్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణకు నష్టం కలిగించే పులిచింతల, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులపై, ఆదివాసులను నిర్వాసితులను చేసే పోలవరంపై టీఆర్‌ఎస్‌, టీడీపీ, బీజేపీలు ఎందుకు నోరెత్తడంలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణను బొందల గడ్డ చేస్తూ, వ్యవసాయాన్ని, పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్న ఓపెన్‌ కాస్ట్‌ బొగ్గు తవ్వకాలపై టీఆర్‌ఎస్‌ స్పందించకపోవడం విచారకరమని ఆయన వెల్లడించారు. తెలంగాణ యువత ఆత్మబలిదానాలు చేసుకోకుండా బరీ గీసి నిలబడి, మిలిటెంట్‌ పొరాటాలతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవాలని సుధాకర్‌ కోరారు.