‘మీ కోసం వస్తున్నా’ నిర్విఘ్నంగా జరగాలని పూజలు

కరీంనగర్‌, అక్టోబర్‌ 9 : ‘మీ కోసం వస్తున్నా’ పాదయాత్రతో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు జరుపుతున్న యాత్రకు ఇబ్బందులు కలగకుండా ఉండాలని జగిత్యాల టిడిపి ఎమ్మెల్యే ఎలిగందుల రమణ పూజలు నిర్వహించారు. జగిత్యాల పట్టణంలో ఆయన మంగళవారం నాడు టిడిపి కార్యకర్తలతో కలసి 12కిలో మీటర్లలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి పాదయాత్రగా వెళ్లారు. అనంతరం స్వామి వారికి పూజలు జరిపారు. బాబు నిర్వహిస్తున్న మీ కోసం పాదయాత్రను ఎవ్వరు అడ్డుకోవద్దని, నిర్విఘ్నంగా కొనసాగాలని స్వామి వారిని కోరినట్లు ఆయన విలేకరులతో తెలిపారు. టిడిపి పాలనలో అభివృద్ధి జరిగిందని, కాంగ్రెస్‌ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ఎవ్వరుకు తోచినంత వారు దోచుకుంటున్నారని రమణ ఆరోపించారు. పాదయాత్రలో రమణ వెంట టిడిపి నేతలు సత్యనారాయణరావు, శ్రీనివాస్‌, మహేష్‌బాబు, జగదీష్‌, శ్రీనివాసరావు, నారాయణరెడ్డి, లక్ష్మీనారాయణ, రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.