ముందుంది ‘క్రోకోడైల్‌ ఫెస్టివల్‌’

– కేటీఆర్‌కు ఫేస్‌బుక్‌ వేదికగా రేవంత్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

హైదరాబాద్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): టీడీపీని వీడిన రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ పార్టీలు మారడం, నోరు పారేసుకోవడం, కేసీఆర్‌ ఇంట్లో ఉండే చిన్న పిల్లలతో సహా అందరినీ తిట్టడం, బ్లాక్‌ మెయిల్‌ చేయడం, చిప్పకూడు తినడం, దిక్కుమాలిన పనులు చేయడం, దానికి కేసీఆర్‌ను నిందించడం’ అంటూ రేవంత్‌ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. అంతేకాదు స్కాం స్టార్లతో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. దీనికి రేవంత్‌ రెడ్డి దిమ్మదిరిగే కౌంటర్‌ ఇచ్చారు. దొరకని దొంగ గుట్టు రట్టు అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు సంబంధించి ఓ ఫొటోను రేవంత్‌ రెడ్డి తన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. 2016లో జరిగిన అధికారిక కార్యక్రమంలో అనధికారికంగా సత్యం రామలింగరాజు కుమారుడు తేజారాజుతో మలేషియన్‌ ప్రధానిని కలిసి మంతనాలాడిన స్కాం స్టార్‌ కేటీఆర్‌కు ముందుంది ‘క్రోకోడైల్‌ ఫెస్టివల్‌’ అంటూ అందులో రాశారు. నేను కాంగ్రెస్‌లో చేరి స్కాం స్టార్లతో తిరుగుతున్నానని కేటీఆర్‌ నిన్న రంకెలేస్తూ ఆవేశపడ్డారు… అయితే ఎవరు ఆ స్టార్లతోనే తిరుగుతున్నారో చెప్పడానికి ఇది తిరుగులేని సాక్ష్యమని అన్నారు. కేటీఆర్‌ విమర్శలు చేస్తున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు. స్కాం స్టార్లతో తిరుగుతున్నానని నిన్న కేటీఆర్‌ అన్నారని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. 2016 జులైలో పెట్టుబడుల సేకరణ పేరుతో కేటీఆర్‌ మలేషియాకు వెళ్లినప్పుడు సత్యం రామలింగరాజు సుపుత్రుడితో కేటీఆర్‌ అక్కడ రహస్యంగా వెలగబెట్టిన నిర్వాకం ఏమిటో చెప్పాలని నిలదీశారు. స్కాం స్టార్లతో తిరుగుతున్న దొరకని దొంగ ఎవరన్న సత్యం తెలంగాణ సమాజం గుర్తించాలని పెట్టారు. రేవంత్‌ పోస్ట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ‘ఆట వేట మొదలయింది ఇక కాచుకోండి పులి పంజా విసరడానికి సర్వం సిద్ధం… కేసీఆర్‌ నీ పతనం మొదలయింది.. ఢీ అంటే ఢీ కొట్టడానికి టైగర్‌ రేవంత్‌ రెడ్డి బరిలోకి దిగుతున్నాడు…నీకు దమ్ముంటే ఢీ కొట్టడానికి సిద్ధం అవ్వు. రాత రాసిన ఆ భగవంతుడు వచ్చినా 2019లో నీ ఓటమిని ఆపలేడు కేసీఆర్‌ అని ఒకరు పోస్ట్‌ చేశారు.