మూడో టెస్టుకి ఇంగ్లాండ్‌ టీమ్‌లో మార్పులు


లండన్‌,ఆగస్ట్‌19(జనం సాక్షి): భారత్‌తో లార్డ్స్‌ వేదికగా సోమవారం రాత్రి ముగిసిన రెండో టెస్టులో అనూహ్యరీతిలో ఓడిపోయిన ఇంగ్లాండ్‌ టీమ్‌.. మూడో టెస్టుకి రెండు మార్పులతో బరిలోకి దిగబోతోంది. లీడ్స్‌ వేదికగా ఈ నెల 25 నుంచి మూడో టెస్టు ప్రారంభంకానుండగా.. టీమ్‌లో రెండు మార్పులు చేసినట్లు ఇంగ్లాండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. సిరీస్‌లో ఘోరంగా విఫలమైన ఓపెనర్‌ రోరీ బర్న్స్‌పై వేటు పడగా.. ఫాస్ట్‌ బౌలర్‌ మార్క్‌వుడ్‌ భుజానికి గాయమైంది. దాంతో.. ఈ ఇద్దరి స్థానాల్లో ఆటగాళ్లని ఈసీబీ తీసుకుంది. భారత్‌తో నాటింగ్‌హామ్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 0, 18 పరుగులు చేసిన రోరీ బర్న్స్‌.. లార్డ్స్‌ టెస్టులోనూ 49, 0 పరుగులతో తేలిపోయాడు. మరీ ముఖ్యంగా 272 పరుగుల ఛేదనలో బాధ్యతారాహిత్యంగా ఆడి డకౌట్‌గా వెనుదిరిగడం ఇంగ్లాండ్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌కి ఆగ్రహం తెప్పించినట్లుంది. దాంతో.. రోరీ బర్న్స్‌పై వేటు పడగా.. అతని స్థానంలో టీమ్‌లోకి డేవిడ్‌ మలాన్‌ వచ్చాడు. 2018లో చివరిగా డేవిడ్‌ మలాన్‌ టెస్టులు ఆడగా.. అది కూడా భారత్‌పైనే కావడం విశేషం. అయితే.. టెస్టుల్లో ఓపెనర్‌గా ఆడిన అనుభవం లేకపోవడంతో.. మలాన్‌ 3వ స్థానంలో బ్యాటింగ్‌ చేసే అవకాశం ఉంది. అదే జరిగితే నెం.3లో ఆడుతున్న హసీబ్‌ హమీద్‌ ఓపెనర్‌గా ఆడాల్సి రావొచ్చు. ఫాస్ట్‌ బౌలర్‌ మార్క్‌వుడ్‌ లార్డ్స్‌ టెస్టులో ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడ్డాడు. అతని భుజానికి గాయమవడంతో.. మూడో టెస్టుకి అతని స్థానంలో ఫాస్ట్‌ బౌలర్‌ షకీబ్‌ మహమూద్‌ని తీసుకున్నారు. టెస్టు క్రికెట్‌లో ఇప్పటి వరకూ షకీబ్‌ ఆడలేదు. కానీ.. ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించి మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా నిలిచాడు. దాంతో.. ఈ పేసర్‌కి లీడ్స్‌లో అరంగేట్రం ఛాన్స్‌ దక్కనుంది. భారత్‌తో మూడో టెస్టుకి ఇంగ్లాండ్‌ తుది జట్టు (అంచనా): డొమినిక్‌ సిబ్లే, హసీబ్‌ హమీద్‌, డేవిడ్‌ మలాన్‌, జో రూట్‌ (కెప్టెన్‌), జానీ బెయిర్‌స్టో, జోస్‌ బట్లర్‌ (వికెట్‌ కీపర్‌), మొయిన్‌ అలీ, శామ్‌ కరన్‌, ఓలీ రాబిన్సన్‌, షకీబ్‌ మహమూద్‌, జేమ్స్‌ అండర్సన్‌