మూసీ, ఈసీపై రూ. 545 కోట్లతో 14 బ్రిడ్జీలు

` గత ప్రభుత్వాల వల్లే మురికి కూపంగా మారిన నది
` అక్టోబర్‌ చివరికల్లా నీటి శుద్దీకరణ పనులు పూర్తి:మంత్రి కేటీఆర్‌
హైదరాబాద్‌ (జనంసాక్షి): మూసీ, ఈసీపై రూ. 545 కోట్లతో 14 బ్రిడ్జిలు నిర్మిస్తున్నామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఫతుల్లగూడా ` పీర్జాదీగూడ బ్రిడ్జికి రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మితో పాటు పలువురు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ మహా నగరానికి గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిన నదిగా మూసీ నది ఉండేదని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో మూసీ నది మురికి కూపంగా మారింది. మూసీ సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయి. అక్టోబర్‌ చివరి నాటికి నీటి శుద్దీకరణ పనులు పూర్తవుతాయన్నారు. మూసీ, ఈసీపై రూ. 545 కోట్లతో 14 బ్రిడ్జిలకు శంకుస్థాపన చేసుకుంటున్నామని తెలిపారు. నిధులు పెరిగినా పరవాలేదు.. హైదరాబాద్‌ ఒక అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించాలి. శాశ్వతంగా, దీర్ఘకాలికంగా ఉండేలా బ్రిడ్జిల నిర్మాణం చేపడుతామన్నారు. 2000 మిలియన్‌ లీటర్స్‌ ఫర్‌ డే కెపాసిటీతో ఎస్టీపీల నిర్మాణం చేస్తున్నాం. దుర్గం చెరువు వద్ద 7 ఎంఎల్‌డీ కెపాసిటీ ఎస్టీపీని నిర్మించాం. ఎస్టీపీలు పూర్తయితే మూసీలోకి పూర్తి స్థాయి శుద్ధి చేసిన నీటిని వదిలే పరిస్థితి. మంచిరేవుల ` ఘట్‌కేసర్‌ వరకు మూసీ నదిని అద్భుతంగా సుందరీకరించాలన్న సీఎం కలను నెరవేరుస్తాం. ఒక్కొక్కటిగా సీవరేజి ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లు పూర్తి చేసి బ్రిడ్జిలు కడుతున్నాం. 160 కిలోవిూటర్ల ఓఆర్‌ఆర్‌ చుట్టూ తిరగకుండా మధ్యలో మూసీ నది విూదుగా వెళ్లే విధంగా బ్రిడ్జిలు నిర్మిస్తాం. రూ. 5 వేల కోట్లతో రెండో విడుత ఎస్‌ఎన్‌డీపీ తొందరలోనే చేపడుతాం. జీవో 118లోని చిన్న చిన్న టెక్నికల్‌ సమస్యలను పరిష్కరిస్తాం అని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

తాజావార్తలు