మెరుగైన సేవల కోసం సూచనలు

మెదక్‌, జూలై 28 : వైద్య సేవలు పేద ప్రజలకు అందే విధంగా తగిన సలహా సూచనలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ దినకర్‌బాబు కొలంబియా యూనివర్శిటీ నుంచి వచ్చిన బృందాన్ని కోరారు. శనివారం కలెక్టరేట్‌లోని తన ఛాంబరులో కొలంబియా యూనివర్శిటీ నుంచి వచ్చి బృందం జిల్లా కలెక్టర్‌ను కలిసారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, మెరుగైన వైద్య ఆరోగ్య సేవలు ప్రజలకు అందించాలనే ఉద్దేశ్యముతో మెదక్‌ జిల్లాను మోడల్‌ జిల్లాగాను జిల్లాలో జోగిపేట క్లస్టర్‌ హెల్త్‌ సెంటర్‌, టేక్మాల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సూరంపల్లి, ఎలకుర్తి సబ్‌ సెంటర్లు మోడల్‌ కేంద్రాలుగా తీర్చిదిద్దెందుకు ఈ బృందం యొక్క సలహా సూచనలు ఇవ్వాలని కలెక్టర్‌ ఆ బృందాన్ని కోరారు. ఈ బృందం జిల్లాలో ఈ నెల 26 నుంచి 28 వరకు జిల్లాలోని జోగిపేట క్లస్టర్‌ హెల్త్‌ సెంటర్‌, టేక్మాల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సూరంపల్లి, ఎలకుర్తి సబ్‌ సెంటర్లను బృందం పరిశీలించి అక్కడ వైద్య సేవలు మెరుగు పర్చడానికి కావలసిన వసతులు, సిబ్బంది, పరికరాలు తదితర వసతుల అవసరాలపై అధ్యాయనం చేసారు. ఈ బృందం అధ్యాయనం ప్రకారం ఇచ్చిన నివేదిక ఆధారంగా జోగిపేట క్లస్టర్‌ హెల్త్‌ సెంటర్‌, టేక్మాల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సూరంపల్లి, ఎలకుర్తి, సబ్‌ సెంటర్లలో సౌకర్యాలు మెరుగుపర్చి మోడల్‌గా తీర్చిదిద్ది ఈ కేంద్రాలను ఆదర్శంగా తీసుకొని జిల్లాలోని అన్ని కేంద్రాలను ఆధునీకరించడం జరుగుతుందని కలెక్టర్‌ తెలిపారు. కొలంబియా యూనివర్శిటీ నుంచి వచ్చిన మెగాన్‌ టవుల్‌, డాక్టర్‌ స్వప్న, మెదక్‌ జిల్ల నుంచి ఎన్‌ఆర్‌ హెచ్‌ఎం డిపివో జగన్నాథ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.