మొక్కలు నాటండి..పర్యావరణాన్ని రక్షించండి

కర్నూలు, జూలై 20 : పర్యావరణ దినోత్సవం, విద్య ప్రత్యేక పక్ష్షోత్సవాలను పురస్కరించుకొని పాఠశాల ప్రాంగణాల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ సుదర్శన్‌ రెడ్డి శ్రీకారం చుట్టారు. చెట్లు ప్రకృతికి ఆక్సిజన్‌ అందిస్తాయని, పిల్లలు కూడా సమాజంలో ఆక్సిజన్‌ లాంటి వారని, మొక్కలు నాటి వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత మీదేనని విద్యార్థులకు పిలుపు నిచ్చారు. శుక్రవారం కల్లూరు మండలం వీకర్‌ సెక్షన్‌, ఇందిరా బిసి కాలని, ఎస్‌ఎపి క్యాంపు నగర పాలక సంస్థ పాఠశాలల్లో నగర పాలక సంస్థ కమీషనర్‌ మూర్తి, డిఇఓ,ఎస్‌ఎస్‌ఎ పిడి బుచ్చన్న, ఎపిఎస్పి అడిషనల్‌ కమాండెంట్‌ సామెల్‌ జాన్‌, డిఎస్పి మహబూబ్‌బాషాలతో కలసి కలెక్టర్‌ మొక్కలు నాటారు. కలెక్టరు సుదర్శన్‌ రెడ్డి మాట్లాడుతూ దేశ భవిష్యత్తు పునాదులు మీరేనని, పాఠశాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని, ఈ సంవత్సరంలో బాగా చదివి వంద శాతం ఫలితాలు తెచ్చేందుకు ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల సేవలు వినియోగించుకోవాలని ఆయన విద్యార్థులను కోరారు. డిఇఓ, ఎస్‌ఎస్‌ఎ పిడి బుచ్చన్న మాట్లాడుతూ నీరు, ఆహారం కలుషిమైతే మార్పు చేసుకోవచ్చని, గాలి కలుషితమైతే స్వచ్ఛమైన గాలినందించే శక్తి చెట్లకు మాత్రమే ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని 54 మండలాల్లో మండలానికి వేయి చొప్పున 54,000 మొక్కలను నాటాడానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రతి మండల విద్యాశాఖాధికారికి వెయ్యి రూపాయల చొప్పున చెల్లించామన్నారు. నగర పాలక సంస్థ కమిషనర్‌ మూర్తి మాట్లాడుతూ ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులు నగరంలో వాడకాన్ని రద్దు చేసామని, వాటిని ఉపయోగించకుండా చూడాల్సిన బాధ్యత విద్యార్థులదేనన్నారు. శానిటేషన్‌, మురుగు కాలువలలో చెత్త చెదారం వేయకుండా పాఠశాల పరిసరాల్లో ఉన్న చెట్లను నరకకుండా చూడాలని విద్యార్థులను కోరారు. అనంతరం మియ్యా, ఎలమంచలి రమణయ్య, ఇనయతుల్లా, ఉపాధ్యా యులు చెట్ల ఉపయోగాలపై పాటలు పాడి విద్యార్థుల మనసులను ఆకట్టుకొన్నారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, టీచర్లు, సర్వశిక్షా అభియాన్‌ కమ్యూనిటీ మొబలైజేషన్‌ అధికారులు పాల్గొన్నారు.