మోడీకి సవాల్ విసిరిన కెసిఆర్ !
ధాన్యం కొనుగోళ్ల రాజకీయంతో తెలంగాణ దద్దరిల్లుతోంది. ధాన్యం కొనాలన్న డిమాండ్‌తో కేంద్రంపై యుద్దం ప్రకటించిన టిఆర్ఎస్ ప్రభుత్వం యావత్తూ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఆందోళనకు దిగింది. కేంద్రం మెడలు వంచుతామని హెచ్చరించింది. ధాన్యం కొనాల్సిందే అంటూ కెసిఆర్ సహా మంత్రులంతా నినదించారు. కెసిఆర్ పిలుపుతో ధర్నా చౌక్ దద్దరిల్లింది. అయితే బిజెపి పాదయాత్రలకు, హుజూరాబాద్ ఓటమికి, బిజెపి ఆందోళనలకు చెక్ పెట్టేలా బలిమి చూపుకునే కార్యక్రమంగా కనిపించింది. ఇప్పుడు సర్వత్రా చర్చగా ఇది మారింది. ప్రధానంగా బిజెపిని లక్ష్యంగా చేసుకుని..తెలంగాణలో దాని ఎదుగుదలను నిరోధించాలన్న సంకల్పం ఈధర్నాతో కెసిఆర్ చాటారనే చెప్పాలి. ఎందుకంటే సాగు చట్టాలపై రైతులు ఏడాదిగా చేస్తున్న ఆందోళనలను విస్మరించిన టిఆర్ఎస్ ఏనాడూ వారికి మద్దతుగా నిలవలేదు. ఢల్లీి పర్యటనలో ఉన్న సమయంలో కనీసం కెసిఆర్ వారిని పలకరించలేదు. వారికి మద్దతుగా కనీసం ఓ ప్రకటనకూడా చేయలేదు. అయితే ఇది రానున్న రోజుల్లో బిజెపికి వ్యతిరేకంగా పోరాడే కార్యక్రమంగా నేచూడాలి. బిజెపికి టిఆర్ఎస్ బలిమిని చాటాలనే కాంక్ష కనిపించింది. అంతేనా అంటే కెసిఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్లేందుకు నాందిగా కనిపించింది. అందుకు ఏదో ఒక కారణం కావాలి కనుక కెసిఆర్ ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని ఎంచుకున్నారని భావించాలి. అయితే ధాన్యం కొనడంలో జరుగుతున్న అనేకానేక విషయాలు చర్చించుకోవాల్సిన సమయమిది. కేంద్రం, రాష్టాల్ర మధ్య ధాన్యం కొనుగోళ్లపైనా స్పష్టత రావాల్సి ఉంది. ధాన్యం అన్నదానికి నిర్వచనం రావాలి. బియ్యం అంటే ఏంటన్న దానిపైనా స్పస్టతా రావాలి. కెసిఆర్ ప్రభుత్వం చేపట్టిన ఈ ధర్నాతో దేశంలో ధన్యం కొనుగోళ్లపైనా స్పష్టత రావాలి. బిజెపి నేతలు ధాన్యం కొంటామాని ప్రకటించారు. ధాన్యం కాస్తా బియ్యంగా మారాక ఎఫ్‌సిఐ తీసుకుం టుంది. అయితే ఇక్కడే అసలు తకరారు కనిపిస్తోంది. ధాన్యం అంటే.. ఉప్పుడు బియ్యం అని కెసిఆర్ సర్కార్ వాదిస్తోంది. బియ్యం అంటే రా రైస్ అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. ధాన్యాన్ని మిల్లులో మామూలు రైస్‌గా తీసుకుని రావాలని ఆయన సూచించారు. ఈ క్రమంలో అసలు విషయం తెలియక రైతులు నానాయాతన పడుతున్నారు. నిన్నమొన్నటి వర్షాలకు ధాన్యం తడిసి కొన్నిచోట్ల, కొట్టుకుని పోయి మరికొన్నచోట్ల రైతులు తీవ్ర నష్టాలకు గురయ్యారు. ఎవరికి వారు అధికారంలో ఉన్నా సమస్యను పరిష్కరించే బదులు తమ రాజకీయ సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు. పోటాపోటీ ధర్నాలు,ర్యాలీలు, విమర్శలతో రాజకీయ లబ్ది పొందడమెలా అని ఆలోచనచేస్తున్నారు. కానీ రైతుల సమస్యలను మాత్రం చర్చించలేదు. రైతులను కూర్చోబెట్టి చర్చిస్తే అసలు సమస్యేంటన్నది వారే వెల్లడిస్తారు. ఎలా అయితే ధాన్యం కొనుగోళ్లు జరుగుతాయో బిజెపి, టిఆర్ఎస్లో చెప్పలేక పోతున్నాయి. ధాన్యం పండిరచిన రైతులు మాత్రం దిగాలుగా చూస్తున్నారు. నిజానికి ధాన్యం కొనుగోలు అన్నది ఒక పంటకు ముందే నిర్ణయించాలి. ఏ పంట వేయాలో ముందే చెప్పాలి. కానీ అదేవిూ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం విూద బిజెపి..కేంద్రంపై టిఆర్ఎస్ యుద్దం చేస్తున్నాయి. ఈ ధర్నాలు, డ్రామాలతో రాజకీయా పార్టీలకు లాభం కలుగుతుందేమో కానీ రైతులకు రవ్వంత కూడా లాభం ఉండదు. ఇది ప్రభుత్వం.. పార్టీల మధ్య పోరాటం కాదని గుర్తించడం లేదు. ఇది ప్రభుత్వాల మధ్య యుద్ధం కాదని కూడా వారు తెలుసు కోవడం లేదు. రైతు పండిరచిన పంట కల్లాలు, మార్కెట్ యార్డ్లు, చివరకు రోడ్లపై కూడా ఎక్కడపడితే అక్కడ దర్శనమిస్తున్నా కొనుగోళ్లకు సంబంధించిన కార్యాచరణ సాగడం లేదు. పండిరచిన పంటను కొనుగోలు చేసి అన్నార్తులకు అందించాలన్న ధ్యాకేంద్రానికి కానరావడం లేదు. గిట్టుబాటు ధర చెల్లించి రైతు నుంచి పంటను కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వాలు పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్న తీరు దారుణం కాక మరోటి కాదు. తాజాగా పరిణామాలు చూస్తుంటే రాజకీయం మొత్తం వడ్ల చుట్టే తిరుగుతోంది. వడ్ల పండిరచాలని ఒకరు, పండిరచవద్దని మరొకరు.. ఇలా రైతులను గందరగోళం లోకి నెట్టేస్తున్నారు.. వడ్లను రాష్ట్ర ప్రభుత్వం కొనాలని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ డిమాండ్ చేస్తుంటే.. కేంద్రమే పంట వేయొద్దు, కొనొద్దు అంటుంది అంటూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ మండిపడుతోంది.. ఇలా ఇరు పార్టీల మధ్య జరుగుతున్న పోరులో రైతులు అయోమయంలో పడిపోతు న్నారు. తెలంగాణలో ఉన్నట్టుండి పంట ఉత్పత్తి పెరగడం ఒక కారణం అయితే.. ఆ స్థాయిలో కొనుగోళ్లు జరగకపోవడమే సమస్యకు అసలు కారణంగా మారింది. అయితే, ఇక్కడే అసలు రాజకీయం మొదలైంది.. వడ్లు, బియ్యం కొనుగోళ్లపై రాజకీయం దుమారమే రేపుతున్నారు.. సవాళ్లు, ప్రతి సవాళ్లు తప్ప తక్షణ సమస్యలకు పరిష్కారం చూపడం లేదు. అధికారంలో ఉన్న ఆ రెండు పార్టీలుపోటాపోటీ ప్రదర్శనలతో తెలంగాణలో తమపట్టును నిలుపుకోవాలన్న బలమైన రాజకీయ వైఖరితో ఉన్నాయి. నిజానికి కేంద్రం ఆలోచనేమిటీ బిజెపి నేతలు స్పష్టం చేయడం లేదు. ఈ క్రమంలో జరుగుతున్న జాప్యం కారణంగా పంటలు కల్లాల్లో తడిసిపోతూ అన్నదాత నలిగిపోతున్నాడు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఒకరి విూద ఒకరు నెపం నెట్టేసుకోవడం తప్ప ధాన్యం నిల్వలను కొనేందుకు ముందుకు రావడం లేదు. రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురియడంతో..సాగు విస్తీర్ణం పెరగడం, పుష్కలంగా పంట పడుతోంది.. ఇక, వరి పెద్ద మొత్తంలో సాగు చేస్తున్నారు.. సాధారణంగా వడ్లను కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఎఫ్‌సిఐ కొనుగోలు చేస్తూ వస్తుంది. వరి పండే రాష్టాల్ర నుంచి వాటిని కొనుగోలు చేసి అవసరం ఉన్న రాష్టాల్రకు సరఫరా చేయడం వారి బాధ్యత.. కానీ, ఎఫ్‌సిఐ దగ్గర ఇప్పుడు బియ్యం నిల్వలు పెరిగి పోవడంతో.. వడ్ల కొనుగోలుకు ముందుకు రావడంలేదు.. వర్షాకాలంలో పండిన పంటను కొనుగోలు చేసినా.. యాసంగిలో పండిన పంటను మాత్రం కొనుగోలు చేయబోమని చెబుతుండడమే సమస్య జటిలంగా మారింది.. కెసిఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో న్యాయం జరిగితే మంచిది. అలాగే కేంద్రం తప్పిదాల పై యుద్దం చేయాల్సి వస్తే మరీ మంచిది. అందుకు తగ్గట్లుగా వివిధ అంవాలపై యుద్దం చేయాలి. కేంద్రం నిరంకుశ విధానాలపై పోరాడాల్సిందే. ప్రజల సమస్యలనెత్తుకుని కెసిఆర్ ముందుకు సాగితే ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుంది. మోడీ నిరంకుశ విధానాలపై పోరాడగలిగితే దేశం యావత్తూ వెన్నంటి వస్తుందని గుర్తించాలి. అందుకు ఎత్తిన పిడికిలి దించకుండా,రాజకీయాలకు తలదించకుండా ముందుకు సాగుతారా లేదా అన్నది కాలమే చెబుతుంది.