యుద్దప్రాతిపదికన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం
విజయనగరం,మార్చి18(జనంసాక్షి): జిల్లావ్యాప్తంగా 50 శాతం కుటుంబాలకు మరుగుదొడ్లు కలిగి ఉండటమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం ముందుకు కదులుతోంది. జిల్లా యంత్రాంగం ఉద్యమంగా తీసుకుని ఆ దారిలో పయనించాలని నిర్ణయం తీసుకుంది. జిల్లా అధికార యంత్రాంగం తీవ్ర కృషితో ప్రస్తుతం వీటి శాతం లక్ష్యానికి చేరుకున్నది. పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు కలెక్టరు చాలా పట్టుదలగా ఉన్నారు. దాంట్లో భాగంగానే మార్చి నెలాఖరు నాటికే 50 శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తవ్వాలని జిల్లాలోని అధికారులందరికీ ఆదేశాలు జారీచేశారు. అంతేకాకుండా వంద గ్రామాల్ని బహిరంగ మలవిసర్జన రహితంగా మార్చాలని లక్ష్యంగా నిర్దేశిరచారు. ఆయనే స్వయంగా గ్రామాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలిస్తున్నారు. విచిత్రమేమిటంటే ఇప్పటివరకూ జిల్లాలో ఒక్క కీలకనేత కూడా మరుగుదొడ్ల నిర్మాణంపై అడుగులు కదపలేదు. అయినా కేవలం జిల్లా యంత్రాంగం మాత్రం ఉడుం పట్టు పట్టింది. మరుగుదొడ్ల నిర్మాణ ప్రగతి పనుల పర్యవేక్షణకు ప్రతీ పంచాయతీకి ఒక మండల అధికారిని, ప్రతీ మండలానికి ఒక జిల్లా అధికారిని ప్రత్యేక అధికారులుగా నియమించారు. ద్యోగులకైతే ఒక్కొక్కరికి 20 నుంచి 30 ఇళ్లను ఓడీఎఫ్ చేసేలా బాధ్యత అప్పగించారు. ప్రతీ గ్రామంలోనూ నాలుగైదు విజిలెన్స్ కమిటీల్ని నియమించి బహిరంగ మలవిసర్జన జరగకుండా గ్రామస్థులకు అవగాహన కల్పించడానికి వారిని నియమించారు. క్షేత్రసహాయకుడు మరుగుదొడ్డి నిర్మాణానికి గుర్తించిన లబ్దిదారుల ఖాళీ స్థలాన్ని చూసి ముందుగా జియోట్యాగింగ్ చేస్తే, నిర్మాణం చేపట్టాక సాంకేతిక సహాయకుడు దాన్ని ఎంబుక్‌లో నమోదు చేయాలి. జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణం నత్తనడకన సాగడంతో కలెక్టరు సైతం చత్తీస్‌గఢ్‌ని ఆదర్శంగా తీసుకుని నిబంధనల్ని సరళీతరం చేస్తే మంచిదన్న అభిప్రాయానికి వచ్చారు. ప్రోత్సాహకాలు జాప్యం అవుతున్నాయని సైతం గ్రహించి నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చారు.