రక్షణ స్టీల్స్‌ ఒప్పందం రద్దు

హైదరాబాద్‌ : బయ్యారం గనులకు సంబంధించి రక్షణ స్టీల్స్‌కు ఇచ్చిన లీజ్‌ ఒప్పందాన్ని కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. ఈ రక్షణ స్టీల్స్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అల్లుడు బ్రదర్‌ అనిల్‌కుమార్‌ది కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ అప్పట్లో రక్షణ స్టీల్స్‌తో ఒప్పందం కుదుర్చుకుని బయ్యారం గనులను లీజ్‌కు ఇచ్చిన విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లా బయ్యారం, గార్ల, నేలకొండపల్లి, వరంగల్‌ జిల్లా గూడూరులో ఈ గనులు లక్షా 41వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ లీజ్‌పై వివాదాలు చెలరేగడంతో ప్రభుత్వం గనుల లీజ్‌ ఒప్పందాన్ని రద్దు చేసేందుకు ముఖ్యమంత్రి అనుమతించారు. దీంతో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు సోమవారం ప్రభుత్వం రద్దుకు ఆదేశాలు జారీ చేసింది.