రాజకీయ పార్టీలకు ఆదిలాబాద్‌ కలెక్టర్‌ విజ్ఞప్తి

ఆదిలాబాద్‌, జూన్‌ 27 : వచ్చే నెల నుండి నిర్వహించనున్న ఓటర్ల జాబితా సవరణకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అశోక్‌కుమార్‌  కోరారు. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి కృషి చేయాలన్నారు. జులైౖ 1 నుంచి ఆగస్టు 28 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని  తెలిపారు.  2013 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండివారంతా  ఓటర్లుగా తమ పేర్లను నామోదు చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. ఎన్నికల సమయంలో ఓటు హక్కు గురించి ఆందోళన చేపట్టే ప్రజలు ఎన్నికల అనంతరం జాబితాలో తమ ఓటు ఉందా లేదా అనే విషయాన్ని పట్టించుకోవడం లేదని  అన్నారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరికీ ఓటరు గుర్తింపు కార్డులను అందిచనున్నామని తెలిపారు. ఆయా పార్టీల నాయకులు తమ ప్రాంతాల ప్రజలకు ఓటు హక్కును కల్పించేలా శ్రద్దతీసుకోవాలని కోరారు.