రాజ్యసభలో మార్మోగిన ‘జై తెలంగాణ’
ముఖం చాటేసిన ప్రధాని, సోనియా, హోంమంత్రి
న్యూఢిల్లీ, ఆగస్టు 17 (జనంసాక్షి):
రాజ్యసభలో శుక్రవారంనాడు ‘తెలంగానం’ మార్మోగింది సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం జరిగిందని కాంగ్రెస్ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్, టిడిపి సభ్యురాలు గుండు సుధారాణి వెలుగెత్తిచాటారు. బిజెపి సభ్యుడు ప్రకాశ్ జవ్‌దేకర్ రాజ్యసభలో శుక్రవారంనాడు తెలంగాణపై ప్రవేశపెట్టిన ప్రైవేట్ తీర్మానంపై చర్చ జరిగింది. అనంతరం ఈ తీర్మానం వీగిపోయింది. ఈ బిల్లుపై జరిగిన చర్చలో జవ్‌దేకర్ మాట్లాడుతూ 2009 డిసెంబర్ 9న తెలంగాణపై ప్రభుత్వం చేసిన ప్రకటనను పూర్తిగా విస్మరించిందని అన్నారు. తెలంగాణ ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా లేదని, అందుకే సాచివేత ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం నాటికైనా ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తమ అభిప్రాయం చెప్పకుండా అఖిలపక్షం నుంచి అభిప్రాయాలను ఎలా సేకరిస్తుందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బిజెపి సభ్యులు సభనుంచి వాకౌట్ చేశారు. చర్చలో కాంగ్రెస్ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ మాట్లాడుతూ తెలంగాణకు జరగని అన్యాయం ఏదీ లేదని అన్నారు. స్మాల్ ఈజ్ బ్యూటీపుల్ అని, చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. తెలంగాణ ప్రజలు ఎన్నో అవమానాలు భరించారని, ఇంకా భరించే ఓపిక లేదన్నారు. సీమాంధ్ర నుండి విడిపోతేనే తెలంగాణకు న్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని కోరుకుం టున్నారని అన్నారు. రెండు రోజుల
క్రితమే స్వతంత్య్రం వచ్చిందని జాతీయ పతాకానికి వందనం చేశామని, కానీ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న రాష్ట్రం రావడం లేదన్నారు. ఆరవయ్యేళ్లుగా తెలంగాణ ప్రజలు ఎన్నో త్యాగాలు చేశారని, అయినా ఆ ప్రాంతానికి న్యాయం జరగలేదని, విడిపోవడమే సమస్యకు పరిష్కారమన్నారు. 1948 సెప్టెంబర్ 17వ తారీఖున నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, హోమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో నిజాం ఆదీనంలో ఉన్న హైదరాబాద్ స్వతంత్ర భారత దేశంలో కలిసిందన్నారు. దాంతో తమకు విముక్తి దొరికిందని ప్రజలు భావించారని, కానీ మళ్లీ ఆంధ్ర ప్రదేశ్‌లో కలవడం వలన తాము అన్యాయానికి గురయ్యామన్నారు. హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్నో భావలలు మాట్లాడే వారు నాటి నుండి ఉంటున్నారన్నారు. టిడిపి సభ్యురాలు గుండు సుధారాణి మాట్లాడుతూ సమైక్యాంధ్ర లో దశాబ్దాలుగా తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ఏలిన ప్రభుత్వాలు తెలంగాణ కోసం జరిగిన ఒప్పందాలను, ఫార్ములాలను ఉల్లంఘించా యన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను కేంద్రం గుర్తించడం లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతిస్తామని కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షమైన ఎన్డీయే ప్రకటించిందని, బిల్లు పెడితే మద్దతివ్వడానికి తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధంగా ఉందని చెప్పారు. అయినప్పటికీ కేంద్రం మాత్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏమాత్రం సుముఖత వ్యక్తం చేయడం లేదని ఆరోపించారు. తెలంగాణ అన్ని రంగాలలో వెనుకబడిందన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక రాష్ట్రం మినహా మరో మార్గం లేదన్నారు. ఒప్పందాలు, చట్టాలు అన్ని ప్రయోగాలు అయిపోయాయని, వాటిని సీమాంధ్ర నేతలు ఉల్లంఘించారన్నారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 60 శాతం తెలంగాణ ప్రాంతం నుండే వస్తుందన్నారు. రాష్ట్రంలో వెంటనే 610 జీవోను అమలు చేయాలని ఆమె కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అరవయ్యేళ్లుగా తెలంగాణ సీమాంధ్రుల చేతిలో మోసపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.